Pakistan: ఐపీఎల్ కంటే పీసీఎల్ గొప్పదట.. గణాంకాలతో చెప్పిన పీసీబీ చీఫ్
- డిజిటల్ రేటింగ్ లు చూస్తే తెలుస్తుందన్న నజమ్ సేథి
- పీఎస్ఎల్ మ్యాచులను డిజిటల్ గా 15 కోట్ల మంది చూసినట్టు వెల్లడి
- ఐపీఎల్ ను చూసిన వారు 13 కోట్లేనన్న పీసీబీ చీఫ్
ఈ ప్రపంచంలో టీ20 ఫార్మాట్ లో గొప్ప లీగ్ ఏది? అని ప్రశ్నిస్తే.. నిపుణులు ఎవరైనా సరే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనే చెబుతారు. కానీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ నజమ్ సేథిని అడిగితే మాత్రం వేరే జవాబు వస్తుంది. ఐపీఎల్ కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మెరుగైనదిగా సేథి సెలవు ఇచ్చారు.
పీఎస్ఎల్ 2023 గత శనివారం ముగిసింది. లాహోర్ జట్టు ముల్తాన్ సుల్తాన్ పై ఒక పరుగు తేడాతో విజయం సాధించి వరుసగా రెండో టైటిల్ తన్నుకుపోయింది. ఈ క్రమంలో పీసీబీ చీఫ్ నజమ్ సేతి మీడియాతో మాట్లాడుతూ.. పీఎస్ఎల్ ఈ ప్రపంచంలోనే గొప్ప లీగ్ ఎందుకనే దానికి వివరణ ఇచ్చారు.
డిజిటల్ రేటింగ్ ల్లో ఐపీఎల్ ను పీఎస్ఎల్ దాటి ముందుకు వెళ్లినట్టు నజమ్ సేథి తెలిపారు. ‘‘డిజిటల్ గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ టీవీ రేటింగ్ లు 0.5గా ఉంటే, పీఎస్ఎల్ రేటింగ్ 11 కంటే ఎక్కువ. పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ తర్వాత 18 లేదా 20కు చేరుతుంది. పీఎస్ఎల్ ను 15 కోట్లకు పైగా ప్రజలు డిజిటల్ మాధ్యమాల్లో వీక్షించారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ఐపీఎల్ ను డిజిటల్ గా చూసింది 13 కోట్లు మందే. కనుక పాకిస్థాన్ కు ఇది పెద్ద విజయం’’అని నజమ్ సేథి ప్రకటన చేశారు.