Kannababu: స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఒక గజదొంగల ముఠా కథ: కన్నబాబు
- స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై అసెంబ్లీలో మాట్లాడిన కన్నబాబు
- చంద్రబాబు అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే మోసం చేశారని వెల్లడి
- సీమెన్స్ కంపెనీకి కాకుండా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని ఆరోపణ
వైసీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఒక గజదొంగల ముఠా కథ అని అభివర్ణించారు. ఇలాంటి స్కాంలతో బలిసిపోయి, లూటీ చేసిన ప్రజాధనంతో మదమెక్కి, రోడ్లెక్కి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విపక్ష నేతలపై నిప్పులు చెరిగారు. ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
చంద్రబాబు అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే రూ.3,356 కోట్ల ప్రాజెక్టు అని మోసం చేశారని ఆరోపించారు. సీమెన్స్ సంస్థ 90 శాతం పెట్టుబడులు పెడుతుందని చెప్పారని కన్నబాబు వెల్లడించారు. ప్రభుత్వం 10 శాతం నిధులు ఇవ్వాలని చెప్పి డబ్బులు విడుదల చేశారని వివరించారు.
ప్రాజెక్టు డీపీఆర్, సర్టిఫికేషన్ లేకుండానే ఆమోదం తెలిపారని, ఎలాంటి గ్యారంటీలు లేకుండా నిధులు మళ్లించారని తెలిపారు. ఒప్పందం చేసుకున్న సీమెన్స్ కంపెనీకి కాకుండా, షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని కన్నబాబు ఆరోపించారు. దోచిన ప్రజాధనాన్ని విదేశాలకు తరలించారని, తప్పు జరిగినప్పుడు చంద్రబాబు ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. స్కాంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ ప్రకటించిందని వెల్లడించారు.
గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోనే స్కాం జరిగిందని కన్నబాబు ఆరోపించారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ స్కాం గురించి ఎల్లో మీడియా ఒక్క మాట కూడా రాయలేదని అన్నారు.
స్కాంలు అన్నింట్లోని పెద్దది ఏలేరు స్కాం అని, ఇది కూడా చంద్రబాబు హయాంలోనే జరిగిందని, అప్పట్లో తాను పాత్రికేయుడిగా పనిచేశానని, ఏలేరు స్కాం గురించి మొదట రాసింది తానే అని కన్నబాబు వెల్లడించారు. ఏలేరు స్కాం నుంచి ఫైబర్ నెట్, ఈఎస్ఐ, స్కిల్ డెవలప్ మెంట్, అన్నింటికి మించి బాహుబలి వంటి అమరావతి స్కాం టీడీపీ హయాంలోనే జరిగాయని వివరించారు.
మూడు ఎమ్మెల్సీలు గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చామని టీడీపీ వాళ్లు పండగ చేసుకుంటూ, కేకులు కోసుకుంటున్నారని, ఇప్పుడు టీడీపీ గెలిచినందువల్ల అమరావతిలో భూమి విలువ ఏమైనా పెరిగిందా? అని ప్రశ్నించారు.