Payyavula Keshav: స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అంటూ సీఎం జగన్ చేసిన ఆరోపణలపై దీటుగా బదులిచ్చిన పయ్యావుల కేశవ్
- అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం
- టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం జరిగిందని ఆరోపణలు
- గుజరాత్ మోడల్ లోనే ఏపీలో ఒప్పందం జరిగిందన్న పయ్యావుల
- గుజరాత్ లోనూ స్కాం జరిగిందని అనగలరా అంటూ సీఎం జగన్ కు సవాల్
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ఆరోపణల పట్ల టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో స్పందించారు. స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి గుజరాత్ ఏ మోడల్ అమలు చేసిందో, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, చత్తీస్ గఢ్ అదే మోడల్ అమలు చేశాయని వివరించారు. ఆ రాష్ట్రాల్లో ఎక్కడా ఏమీ జరగలేదని, ఆరోపణలు కూడా రాలేదని పయ్యావుల కేశవ్ వివరించారు.
మరి ఏపీలో డబ్బులు పోయాయంటే, గుజరాత్ లో కూడా ఇలాగే డబ్బులు పోయి ఉంటాయని మీరు అనగలరా? ఆ ధైర్యం మీకుందా? అని వైసీపీ నేతలను సవాల్ చేశారు. "గుజరాత్ లో ఎలా ఒప్పందం జరిగిందో, ఏపీలోనూ అదే ఫార్మాట్లో ఒప్పందం జరిగింది. మరి గుజరాత్ లో కూడా గోల్ మాల్ జరిగిందని మీరు అనగలరా? దానిపై అడిగే ధైర్యం కూడా మనకు లేదు. ఇక్కడ మాత్రం డబ్బులు పోయాయని అంటున్నారు. మరి టీడీపీ నేతల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లాయని చెబుతున్నప్పుడు, ఆ విషయాన్ని నిరూపించగలరా? కేవలం అసత్య ప్రచారాలతోనూ, అభూత కల్పనలతోనూ మోసగించాలని చూస్తున్నారు" అంటూ మండిపడ్డారు.
ఇదెక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది అని చూస్తే... ఈ రాష్ట్ర యువత భవిష్యత్తును నిర్మించేందుకు వచ్చింది, యువతకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చింది అని పయ్యావుల కేశవ్ తెలిపారు.
"ఈ స్కిల్ డెవలప్ మెంట్ పథకం మొదటగా గుజరాత్ రాష్ట్రం తీసుకువచ్చింది. గుజరాత్ రాష్ట్రం బాటలోనే ఏపీ కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీతో మరో నాలుగు రాష్ట్రాలు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎక్కడా ఆరోపణలు రాకపోయినా, ఏపీలో మీ వల్ల ఆరోపణలు వచ్చాయి. డిజైన్ టెక్ సంస్థ ఎక్కడో జీఎస్టీ చెల్లించకపోతే, దాన్ని జీఎస్టీ ఇంటెలిజెన్స్ వెలికి తీసింది. జీఎస్టీ, జీఎస్టీ ఇంటెలిజెన్స్ వేరు కాదు ముఖ్యమంత్రి గారూ.
ఈ వ్యవహారాన్ని జీఎస్టీ ఇంటెలిజెన్స్ వింగ్ బయటికి తీసి సీబీఐ విచారణకు ఇస్తే, సీబీఐ విచారణ చేయడం, రాష్ట్రంలో ఏసీబీ విచారణ చేయడం అన్నీ జరిగాయి. అన్నీ సక్రమంగానే ఉన్నాయి... జీఎస్టీ చెల్లించలేదనేది మాత్రం నిజం అని తేల్చాయి. మీరు అధికారంలోకి వచ్చాక, క్యాబినెట్ సబ్ కమిటీ అడిగినట్టుగా ఆర్జా శ్రీకాంత్ గారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలోనూ అన్నీ సక్రమంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఇంతమంది సక్రమంగానే ఉందని చెబుతుంటే, ఓవైపు ఈడీ విచారణ జరుగుతుంటే మీరు మాత్రం అక్రమాలు జరిగాయని అంటున్నారు.
ఇవన్నీ ఎందుకు... ఓటమి భారం నుంచి తప్పించుకోవడానికి, జనానికి ముఖం చూపించుకోలేని పరిస్థితుల్లో, టీడీపీ కూడా అవినీతికి పాల్పడిందని దుష్ప్రచారానికి పూనుకున్నారు. అంతేతప్ప స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అనేది తప్పు. ఇప్పటివరకు జరిగినవి ఏవైనా ఉంటే, అవి ఆయా సంస్థల్లో జరిగాయే తప్ప, రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాల్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లలో కానీ ఎటువంటి లోటుపాట్లు లేవని ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు తేల్చాయి.
మరో 30, 40 రోజుల్లో ఈడీ దర్యాప్తులో మిగిలినవన్నీ బయటికి వస్తాయి. అంతలోనే ఇంత తొందరెందుకు ముఖ్యమంత్రి గారూ... మీరు కేసుల గురించి, అరెస్టుల గురించి, క్విడ్ ప్రో కో గురించి, షెల్ కంపెనీల గురించి మాట్లాడితే ఎలా ముఖ్యమంత్రి గారూ...! అసలు దేశంలో క్విడ్ ప్రో కో, షెల్ కంపెనీలు అనే మాటలకు ఆద్యులు, పూజ్యులు ఎవరు... మనం కాదా...? అప్పుడే కదా ప్రభుత్వాలన్నీ మేల్కొని అనేక చట్టాలను, మార్పులను తీసుకువచ్చింది" అంటూ పయ్యావుల ఎద్దేవా చేశారు.