BJP: ప్రపంచంలోనే ఎంతో ముఖ్యమైన పార్టీ బీజేపీ: అమెరికా దిగ్గజ పత్రిక
- అమెరికా ప్రయోజనాల కోణంలో ముఖ్యమైన పార్టీగా అభివర్ణన
- అమెరికా వ్యూహ ప్రణాళికల్లో భారత్ కీలకంగా మారుతున్నట్టు వెల్లడి
- బీజేపీని విదేశీయులు చాలా తక్కువగా అర్థం చేసుకున్నట్టు అభిప్రాయం
- ఇతర వర్గాలకూ బీజేపీ చేరువ అవుతున్నట్టు ప్రస్తావన
అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్.. సాధారణంగా మోదీ సర్కారును లక్ష్యంగా చేసుకుని వ్యతిరేక కథనాలు రాస్తుంటుంది. ఇప్పుడు అదే పత్రిక.. బీజేపీని అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీగా పేర్కొంది. వాల్టర్ రస్సెల్ అనే ఆథర్ దీనిపై ఆర్టికల్ రాశారు.
‘‘భారత్ లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. అమెరికా జాతీయ ప్రయోజనాల కోణం నుంచి చూస్తే ప్రపంచంలోనే ఎంతో ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ. అంతేకాదు చాలా తక్కువగా అర్థం చేసుకున్న పార్టీ’’అని పేర్కొన్నారు. భారత్ ఆర్థికంగా శక్తిమంతమైన దేశంగానే కాకుండా, అమెరికా వ్యూహ ప్రణాళికల్లో కీలక దేశంగా ఉంటోందన్నారు. చైనా శక్తిని కట్టడి చేయాలన్న అమెరికా ప్రయత్నాలు భారత్ సాయం లేకుండా సఫలం కాబోవన్నారు.
భారతీయులు కాని వారికి తెలియని రాజకీయ, సాంస్కృతిక చరిత్ర నుంచి బీజేపీ ఎదిగినందున దీన్ని చాలా తక్కువగా అర్థం చేసుకున్నట్టు చెప్పారు. బీజేపీ కేవలం హిందువులకే కాకుండా, ఇతర వర్గాలకూ దగ్గరవుతున్న అంశాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తన కాలమ్ లో ప్రస్తావించింది. క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల సాధించిన ఫలితాలు, 20 కోట్ల జనాభా ఉన్న యూపీలో బీజేపీకి షియా ముస్లింల మద్దతును గుర్తు చేసింది. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య పాత్ర పోషించినట్టు పేర్కొంది.