Royal Enfield: రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్.. కంపెనీ ముందడుగు

Plugged in Royal Enfield plans differentiated electric vehicles
  • 2025లో తొలి ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణకు ప్రణాళికలు
  • పరీక్షల దశకు చేరినట్టు వెల్లడించిన కంపెనీ సీఈవో
  • చాలా భిన్నమైన ప్రణాళికలతో పనిచేస్తున్నట్టు వెల్లడి
రాయల్ ఎన్ ఫీల్డ్.. ప్రీమియం మోటారు సైకిళ్లలో లీడర్ గా ఉంది. 300సీసీ మించి సామర్థ్యం కలిగిన మోటారు సైకిళ్ల మార్కెట్లో 93 శాతం వాటా ఈ సంస్థ సొంతం. నేడు ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుండడం.. కస్టమర్లు ఈవీల వైపు అడుగులు వేస్తుండడంతో, ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో వెనుకబడి పోవాలని అనుకోవడం లేదు. ఎలక్ట్రిక్ కు మళ్లే ప్రీమియం కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని.. వారి కోసం ఈవీ బైక్ లను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ దిశగా తాము చెప్పుకోతగ్గ పురోగతి సాధించామని కంపెనీ సీఈవో బి.గోవిందరాజన్ ఓ వార్తా సంస్థకు తెలిపారు.

‘‘రాయల్ ఎన్ ఫీల్డ్ తన తొలి బైక్ ను 2025లో విడుదల చేయాలనే ప్రణాళికతో ఉంది. ఈవీలకు సంబంధించి మంచి ముందడుగు వేశాం. కొన్ని ఆలోచనలు ఇప్పటికే పరీక్షల దశలోకి చేరాయి. ఎలక్ట్రో మొబిలిటీకి సంబంధించి చాలా భిన్నమైన ప్రణాళికలు మా దగ్గర ఉన్నాయి. మార్కెట్, ధోరణులను అర్థం చేసుకునేందుకు తగినంత సమయం వెచ్చించాం’’అని గోవిందరాజన్ చెప్పారు. 

ఎల్1సీ కోడ్ నేమ్ తో రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ను రూపొందిస్తోంది. 2025లో దీన్ని విడుదల చేయనుండగా, తొలుత ఏటా 5,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలనే ప్రణాళికతో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ నుంచి వచ్చిన ఉమేష్ కృష్ణప్ప నాయతక్వంలో ఇందు కోసం పరిశోధన, అభివృద్ధి బృందం ప్రత్యేకంగా పనిచేస్తోంది. ఇతర సంస్థల మాదిరి కాకుండా.. ఖరీదైన బైకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్నట్టే, ఈవీ బైకుల్లోనూ ప్రత్యేక స్థానం ఉండేలా రాయల్ ఎన్ ఫీల్డ్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
Royal Enfield
electric vehicles
testing phase
different plans

More Telugu News