Vishnu Vardhan Reddy: కవిత వద్ద 9 ఫోన్లా... మొబైల్ దుకాణం యజమానుల వద్ద కూడా అన్ని ఫోన్లు ఉండవు: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy reacts to Kavitha showing mobile phones
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు
  • నేడు ఈడీ ఆఫీసుకు వచ్చిన కవిత
  • తన వద్ద ఉన్న ఫోన్లు అప్పగించనున్న వైనం
  • కవిత నేరాన్ని అంగీకరించినట్టేనా అంటూ విష్ణు ట్వీట్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన వద్ద ఉన్న ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను దర్యాప్తు అధికారులకు అప్పగించేందుకు నేడు ఈడీ ఆఫీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఈడీ కార్యాలయం ఎదుట కారు దిగుతూ, ఫోన్లు ఉన్న సంచిని కవిత మీడియాకు ప్రదర్శించారు. 

దీనిపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. కవిత 9 ఫోన్లు ఎందుకు ఉపయోగిస్తున్నట్టు? అని ప్రశ్నించారు. ఆమెకు ఏమైనా మొబైల్ ఫోన్ల దుకాణం ఉందా? మొబైల్ ఫోన్ల దుకాణం యజమానులు కూడా అన్ని ఫోన్లు ఉపయోగించరు అని విమర్శించారు. 

కేవలం బుకీలు, మనీలాండరింగ్, హవాలా కార్యకలాపాలకు పాల్పడే వారే ఆమె లాగా అన్ని ఫోన్లు ఉపయోగిస్తారు అని విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు. ఆమె చిత్రాలు చూస్తుంటే నేరాన్ని అంగీకరించినట్టే భావించాలా? అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, కవిత ఫోన్లు ఉన్న సంచిని మీడియాకు ప్రదర్శిస్తున్న ఫొటోలను కూడా విష్ణు పంచుకున్నారు.
Vishnu Vardhan Reddy
K Kavitha
Mobile Phones
ED
Delhi Liquor Scam
BJP
BRS
Andhra Pradesh
Telangana

More Telugu News