Nara Lokesh: లోకేశ్ పాదయాత్రకు మూడు రోజుల విరామం

Lokesh appreciates MLC winners

  • ఉత్సాహంగా కొనసాగుతున్న యువగళం పాదయాత్ర
  • నేడు పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రవేశించిన పాదయాత్ర 
  • రేపు ఉగాది పండుగ
  • ఈ నెల 22, 23, 24 తేదీల్లో లోకేశ్ పాదయాత్రకు బ్రేక్
  • మూడ్రోజులూ గొనుకువారిపల్లి విడిది కేంద్రంలోనే లోకేశ్


టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. పాదయాత్రలో జనం భారీగా తరలివచ్చి లోకేశ్ కు సంఘీభావం తెలిపారు. 49వ రోజున (మంగళవారం) యువగళం పాదయాత్ర కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తయి పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. 

తమ డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న అంగన్‍వాడీ వర్కర్లకు మద్ధతుగా లోకేశ్ నల్ల బ్యాడ్జీ ధరించి పాదయాత్ర చేపట్టారు. లోకేష్ తో పాటు పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు కూడా నల్లబ్యాడ్జీలు ధరించారు. జీతాల పెంపుపై హామీలు అమలు చేయాలని కోరితే అంగన్ వాడీలను అరెస్టు చేయడం దారుణం అని లోకేశ్ మండిపడ్డారు. హక్కుల కోసం గళమెత్తె అంగన్వాడీలపై పోలీసులతో అణచివేత అప్రజాస్వామికం అని విమర్శించారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేరవేర్చాలని లోకేశ్ డిమాండ్ చేశారు. 

నేటి పాదయాత్రలో లోకేశ్ కు సంఘీభావంగా టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు పాల్గొని కొంతదూరం నడిచారు. లోకేశ్ పాదయాత్ర పులగంపల్లి గ్రామం వద్ద పుట్టపర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పుట్టపర్తి నియోజవకర్గంలో లోకేశ్ కు ఘనస్వాగతం లభించింది. అనంతరం గొనుకువారిపల్లి క్రాస్ వద్ద పాదయాత్ర విడిది కేంద్రానికి చేరింది.
ఇక ఉగాదిని పురస్కరించుకుని లోకేశ్ పాదయాత్రకు మూడు రోజులు విరామం ప్రకటించారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో యువగళం పాదయాత్ర నిలిచిపోనుంది. ఈ మూడు రోజులు లోకేశ్ పుట్టపర్తి నియోజకవర్గం గొనుకువారిపల్లి విడిది కేంద్రంలోనే బస చేయనున్నారు.

లోకేశ్ ను కలిసిన ఎమ్మెల్సీ విజేతలు

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన విజయాలు సాధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవిరావు కదిరిలో లోకేశ్ ను కలిశారు. ఈ సందర్భంగా ముగ్గురినీ లోకేశ్ శాలువా కప్పి సత్కరించారు. వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన మీరు రియల్ హీరోలు అని ప్రశంసించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గకుండా సైకో పాలనపై మీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజా సమస్యలపై మండలిలో ప్రజాగళాన్ని గట్టిగా వినిపించాలని కోరారు. తమపై నమ్మకంతో సీటు ఇచ్చిన మీకు మా గెలుపును అంకితం చేస్తున్నామని శ్రీకాంత్, రాం గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. 

టిడ్కో ఇళ్లను పరిశీలించిన యువనేత లోకేష్

కదిరి శివారు ముత్యాలమ్మ చెరువువద్ద టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లోకేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ గోడు వినిపించారు. టిడ్కో ఇళ్ల విషయంలో తమకు ఎదురవుతున్న సమస్యలను నివేదించారు. లోకేశ్ స్పందిస్తూ... గెలిచిన వెంటనే ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తామని జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం పూర్తయిన ఇళ్లను పూర్తి చేసి లబ్ది దారులకు ఇవ్వకుండా అనేక నిబంధనలు పెట్టి పేదవారిని వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. 

"నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలి. టిడ్కో ఇళ్లు ఇవ్వకపోగా సెంటు స్థలం పేరుతో వేల కోట్ల ప్రజా ధనాన్ని వైసీపీ నాయకులు దోచుకున్నారు. తక్షణమే మిగిలిన పనులు పూర్తి చేసి పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలి. ఉచితంగా ఇళ్లు కేటాయిస్తామని జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తాం" అని లోకేశ్ హామీ ఇచ్చారు. 

హంద్రీనీవా కాల్వను పరిశీలించిన లోకేశ్

కదిరి మండలం చిన్నగుట్టతాండా వద్ద బొంతలవారిపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా చెర్లోపల్లి జలాశయానికి హంద్రీనీవా జలాలను అందించే కాల్వను లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మంగళవారం పరిశీలించారు. హంద్రీనీవా కాల్వ వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్... రాయలసీమలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ ముందు అయినా ఇలా సెల్ఫీ దిగే దమ్ము ఉందా? అని సవాల్ విసిరారు.

ముస్లిం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు వద్ద సెల్ఫీ

కదిరి శివారు సీపీఐ కాలనీ వద్ద నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి నోచుకోని ముస్లిం మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ కాలేజి వద్ద లోకేశ్ సెల్ఫీ దిగారు. కేవలం ముస్లిం, మైనారిటీ బాలికల కోసం ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్ (గురుకుల పాఠశాల) నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం రూ.17 కోట్లకు పైచిలుకు నిధులను కేటాయించిందని లోకేశ్ ఈ సందర్భంగా వెల్లడించారు. 

"టీడీపీ ప్రభుత్వం నిధులు కేటాయించిన వెంటనే పనులు ప్రారంభించి 80 శాతం మేర పనులు పూర్తి చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అతి కష్టమ్మీద నాలుగేళ్లపాటు సాగదీసి మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేసింది. నిర్మాణాలు పూర్తయినప్పటికీ చంద్రబాబుకు పేరు వస్తుందని ఇప్పటికీ ప్రారంభించకుండా అలాగే వదిలేశారు" అని ఆరోపించారు. 

=====

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 625 కి.మీ.*

*49వరోజు (మంగళవారం) నడిచిన దూరం 12.5 కి.మీ.*

*ఉగాది సందర్భంగా 22, 23, 24 తేదీలు పాదయాత్రకు విరామం*

*(గమనిక: లోకేశ్ ఈ 3రోజులు గొనుకువారిపల్లి విడిది కేంద్రంలోనే బస చేస్తారు)*

*25వతేదీన పుట్టపర్తి నియోజకవర్గం గొనుకువారిపల్లి నుంచి 50వరోజు పాదయాత్ర ప్రారంభం.*

  • Loading...

More Telugu News