Delhi NCR: ఢిల్లీలో భవనాలు ఊగిపోతుంటే భయపడిపోయిన ప్రజలు.. వీడియోలు ఇవిగో
- ఢిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతంలో ఇళ్ల బయటకు వచ్చేసిన స్థానికులు
- ప్రకంపనలకు ఊగిపోతున్న వాటిని వీడియో తీసి ట్విట్టర్ లో షేర్
- భూకంప కేంద్రం అప్ఘానిస్థాన్ లోని హిందూ కుష్ రీజియన్
మంగళవారం రాత్రి ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వచ్చిన భూప్రకంపనలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. భవనాలు ఊగిపోతుంటే నివాసితులు భయంతో ఇళ్ల బయటకు వచ్చేసి కొంత సమయం పాటు పడిగాపులు కాశారు. భవనాలు ఊగిపోతున్న తీరును కొందరు తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్లో పంచుకున్నారు.
నిజానికి అఫ్ఘానిస్థాన్ లోని హిందూకుష్ రీజియన్ లో 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు పాకిస్థాన్ మెటీరియోలాజికల్ విభాగం ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. దీని కారణంగా పాకిస్థాన్ లో 8 మంది మరణించారు. భూప్రకంపనలు భారత్ తో పాటు, అప్ఘానిస్థాన్, పాకిస్థాన్, తుర్కుమెనిస్థాన్, కజకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, చైనా తదితర దేశాల్లోనూ వచ్చాయి. ముఖ్యంగా పాకిస్థాన్, చైనాలో తీవ్రమైన ప్రకంపనలు వచ్చాయి. మన దేశంలో ఢిల్లీతోపాటు జమ్మూకశ్మీర్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు సైతం విస్తరించాయి.
ఢిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతంలో భూప్రకంపనలు సుమారు కొన్ని నిమిషాల పాటు కొనసాగినట్టు స్థానికులు చెబుతున్నారు. రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు ప్రకంపనలు వచ్చినట్టు కొందరు తెలిపారు. ఆ సమయంలో ఇంట్లోని షాండ్లియర్స్, ఫ్యాన్లు, మేకులకు తగిలించిన బ్యాగులు ఊగిపోతూ కనిపించాయి. భవనాలు ఊగడాన్ని కూడా గమనించొచ్చు.