Rajasthan: ప్రజల కోసం మంచి నిర్ణయం తీసుకున్న రాజస్థాన్ సర్కారు
- ప్రజలకు ఆరోగ్య హక్కును కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ నిర్ణయం
- రైట్ టు హెల్త్ బిల్లుకు ఆమోదం
- అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, ఔషధాలు
- కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇదే మాదిరిగా ఉచిత వైద్యం
దేశంలో ఇంత వరకు ఏ రాష్ట్రం తీసుకోని, తీసుకోలేని నిర్ణయాన్ని రాజస్థాన్ సర్కారు ఆచరణలో చూపించింది. ఆరోగ్య హక్కుని ప్రజలకు కల్పించింది. రైట్ టు హెల్త్ బిల్లుని రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. దీంతో ప్రజలు ఇక మీదట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ సేవలను ఉచితంగా పొందొచ్చు. అంతేకాదు, ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇదే మాదిరిగా ఉచిత సేవలు పొందే హక్కు ప్రజలకు ఉంటుంది. బిల్లులో కొన్ని సవరణలు చేయాలంటూ ప్రతిపక్ష బీజేపీ సభ్యులు బలంగా అడ్డుకున్నప్పటికీ.. రాజస్థాన్ సర్కారు అంగీకరించలేదు. బిల్లును యథాతథంగా ఆమోదించింది. కొంత మంది వైద్యులు ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని చేస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ కోరింది.
ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్, ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత ఔషధాలు, అత్యవసర వైద్యం, శస్త్ర చికిత్సలను కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో పొందొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలకు గురైన వారు అత్యవసర వైద్యాన్ని రూపాయి చెల్లించకుండానే ఉచితంగా పొందొచ్చని బిల్లు స్పష్టం చేస్తోంది.
ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులు తాము పొందిన సేవలకు చార్జీలు చెల్లించలేని పరిస్థితుల్లో.. వాటిని సంబంధిత ఆసుపత్రులు లేదా వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రీయింబర్స్ చేసుకోవచ్చని పేర్కొంది. రైట్ టు హెల్త్ కింద మొత్తం 20 హక్కులు కల్పించింది. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోణంలో ఈ బిల్లును తీసుకొచ్చినట్టు వైద్య శాఖ మంత్రి ప్రసాదిలాల్ తెలిపారు.