Narendra Modi: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు....ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం
- గత కొన్ని రోజులుగా 1000కి పైగా కొత్త కేసులు
- గత 24 గంటల్లో 1,134 పాజిటివ్ కేసులు
- తాజాగా ఐదుగురి మృతి
- కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్న మోదీ
భారత్ లో మరోసారి కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా నిత్యం 1000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న 6 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే లేఖ రాసింది. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
ఢిల్లీలో ఈ సాయంత్రం 4.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. మరోసారి కొవిడ్ తీవ్రరూపు దాల్చకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్రజారోగ్య వ్యవస్థలు సన్నద్ధమవ్వాల్సిన తీరుపై ప్రధాని మోదీ ఈ సమావేశంలో చర్చించనున్నారు.
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,134 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఐదుగురు మరణించారని తెలిపింది. కేంద్రం వద్ద ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో 7,026 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత కొంతకాలంగా కరోనా మరణాలేవీ లేకపోగా, ఇటీవల మళ్లీ మరణాలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చత్తీస్ గఢ్, కేరళ, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రలో ఒక్కో మరణం నమోదయ్యాయి.