Barricades: ఢిల్లీలో బ్రిటన్ హైకమిషన్ కార్యాలయం వద్ద బ్యారికేడ్ల తొలగింపు... లండన్ ఘటనకు ప్రతీకారం...?

Barricades out side Britain High Commission in Delhi was removed
  • భారత్ లో ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృత్ పాల్ కోసం వేట
  • ఇటీవల లండన్ లో ఖలిస్థాన్ ఉద్యమకారుల ఆందోళన 
  • భారత దౌత్య కార్యాలయాన్ని ముట్టడించిన వైనం
  • త్రివర్ణ పతాకాన్ని తొలగించిన ఆందోళనకారులు
దేశ రాజధాని ఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ కార్యాలయం వద్ద భద్రతా బ్యారికేడ్లను పోలీసులు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల లండన్ లో భారత హైకమిషన్ కార్యాలయాన్ని ముట్టడించిన ఖలిస్థాన్ అనుకూలవాదులు భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించడం తెలిసిందే. 

భారత దౌత్య కార్యాలయానికి తగిన భద్రత కల్పించకపోవడం వల్లే ఖలిస్థాన్ మద్దతుదారులు దుశ్చర్యకు పాల్పడగలిగారని భారత్... బ్రిటన్ ప్రభుత్వానికి తన అసంతృప్తిని తెలియజేసింది. ఢిల్లీలో బ్రిటన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. 

ఈ క్రమంలో, ఢిల్లీలోని బ్రిటన్ దౌత్య కార్యాలయం వద్ద బ్యారికేడ్లు తొలగించడం లండన్ ఘటనకు ప్రతీకారం అయ్యుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. 

బ్రిటన్ హైకమిషన్ కార్యాలయం ఎదుట ఉన్న బ్యారికేడ్ల వల్ల వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అందుకే తొలగించామని చెప్పారు. ఆ మార్గం గుండా వెళ్లేవారికి బ్యారికేడ్లు అడ్డంకులుగా మారాయని తెలిపారు. అయితే, బ్రిటన్ దౌత్య కార్యాలయానికి కల్పిస్తున్న భద్రతలో ఏ మాత్రం మార్పు లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఢిల్లీలోని బ్రిటీష్ దౌత్య సిబ్బందిని దీనిపై మీడియా ప్రశ్నించగా, భద్రతా అంశాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని తెలిపారు. 

పంజాబ్ లో ఓ పోలీస్ స్టేషన్ పై దాడి కేసులో పోలీసులు అమృత్ పాల్ సింగ్ అనే ఖలిస్థాన్ మద్దతుదారుడి కోసం తీవ్రస్థాయిలో వేటాడుతున్న సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ లండన్ లో ఖలిస్థాన్ సానుభూతిపరులు భారత ఎంబసీని చుట్టుముట్టారు.
Barricades
Britain High Commission
New Delhi
lon
Khalistan

More Telugu News