Russia: పాటలతో పుతిన్‌ను తూర్పారబట్టిన గాయకుడి మృతి!
- 35 ఏళ్ల చిన్న వయసులోనే మృతి
- గడ్డకట్టిన వోల్గా నదిని దాటుతుండగా మంచులో చిక్కుకున్న దిమా నోవా
- ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ పాటలు
- పాప్యులర్ అయిన ‘ఆక్వా డిస్కో’ పాట
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తన పాటలతో విమర్శించిన రష్యన్ సంగీతకారుడు దిమా నోవా 35 ఏళ్ల చిన్న వయసులోనే మృతి చెందాడు. నదిని దాటుతుండగా మంచులో కూరుకుపోయి మృతి చెందినట్టు ‘న్యూయార్క్ పోస్ట్’ తెలిపింది. దిమా నోవా అసలు పేరు దిమిత్రి స్విర్గునోవ్. ‘క్రీమ్ సోడా’ అనే పాప్యులర్ ఎలక్ట్రానిక్ గ్రూప్‌ను స్థాపించాడు. ఈ నెల 19న తన సోదరుడు, ముగ్గురు స్నేహితులతో కలిసి గడ్డకట్టిన వోల్గా నదిని దాటుతుండగా మంచులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. మంచుకింద చిక్కుకున్న అతడి స్నేహితులు ఇద్దరినీ రక్షించగా, మరో స్నేహితుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ దిమా నోవా తరచూ తన పాటలతో పుతిన్‌ను విమర్శించేవాడు. రష్యాలో జరిగిన యుద్ధ వ్యతిరేక నిరసనల సమయంలో అతడి సంగీతాన్ని ఒక గీతంలా ఉపయోగించేవారు. చాలా పాప్యులర్ అయిన, వివాదాస్పద పాట ‘ఆక్వా డిస్కో’. రష్యాలో ఆందోళనల సమయంలో ఈ పాటను ఎక్కువగా ఆలపించేవారు.
పుతిన్‌కు 1.3 బిలియన్ డాలర్ల విలువ చేసే విలాసమైన భవనం ఉందని నోవా తన పాటల్లో విమర్శించేవాడు. ఆ తర్వాత ఆ నిరసనలు ‘ఆక్వా డిస్కో పార్టీలు’గా ప్రసిద్ధి చెందాయి. కాగా, నోవా మృతిని ‘క్రీమ్ సోడా’ నిర్ధారించింది.