Russia: పుతిన్ ను అరెస్ట్ చేస్తే.. బాంబ్ దాడి చేస్తాం: పుతిన్ ముఖ్య అనుచరుడు ద్విమిత్రి మెద్వదేవ్ హెచ్చరిక
- పుతిన్ పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్
- పుతిన్ ను అరెస్ట్ చేయడం అంటే రష్యాపై యుద్ధం ప్రకటించడమేనని వ్యాఖ్య
- ఆయుధాల సరఫరాను వేగవంతం చేయాలని యూరప్ కు జెలెన్ స్కీ పిలుపు
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. దీనిపై పుతిన్ ముఖ్య అనుచరుడు ద్విమిత్రి మెద్వదేవ్ సీరియస్ గా స్పందించారు. పుతిన్ ను అరెస్ట్ చేయడం అంటే అది రష్యాపై యుద్ధాన్ని ప్రకటించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు పుతిన్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే ఏ దేశం అని కూడా చూడకుండా రష్యా బాంబు దాడి చేయగలదని హెచ్చరించారు.
పుతిన్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని, ఉక్రెయిన్ నుంచి వందలాది పిల్లలను అక్రమంగా తరలిస్తున్నారంటూ ఐసీసీ వ్యాఖ్యానించింది. దీంతో మెద్వదేవ్ కఠిన హెచ్చరికలు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీడియో సందేశాన్ని మెద్వదేవ్ టెలిగ్రామ్ లో పోస్ట్ చేసినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది. మరోవైపు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని, తమకు ఆయుధాల సరఫరాను వేగవంతం చేయాలని యూరప్ ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు.