Kotamreddy Giridhar Reddy: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
- ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
- అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
- పసుపు కండువా కప్పిన చంద్రబాబు
- గిరిధర్ రెడ్డికి సాదర స్వాగతం పలికిన వైనం
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ నేత గిరిధర్ రెడ్డి నేడు టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచుకున్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి పసుపు కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. గిరిధర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో టీడీపీలోకి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు.
2023లో... 23వ తేదీన... 23 ఓట్లతో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం దేవుడి అసలైన స్క్రిప్ట్ అని అభివర్ణించారు. దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడని పేర్కొన్నారు. “వైసీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గిరిధర్ రెడ్డి టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టీలో చేరారు. వారితో పాటు కోవూరు, గూడూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ నియోజకవర్గాల వైసీపీ నేతలు, కొన్ని వందలమంది కార్యకర్తలు వైసీపీకి రాజీనామాలు చేసి, నేడు పసుపు కండువాలు కప్పుకున్నారు. అందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రమంతా గెలుస్తుంది. గిరిధర్ రెడ్డిలాంటి వారు పార్టీలోకి రావడంవల్ల పార్టీ బలం ఇంకా పెరుగుతుంది.జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. గిరిధర్ రెడ్డి లాంటి సేవాభావం ఉన్నవారే జగన్ పార్టీలో ఉండలేకపోతే, సామాన్యకార్యకర్తలు ఎలా ఉంటారు? జగన్ నమ్మిన వారిని నట్టేట ముంచే రకం. జగన్మోహన్ రెడ్డి ఇక మళ్లీ గెలవడు.
గిరిధర్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు. ప్రజలకు సేవ చేయాలని తపన పడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని వైసీపీ వద్దనుకుంది. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ మరోసారి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం" అని పేర్కొన్నారు.
తెలుగుదేశం కుటుంబంలో తనను భాగస్వామిని చేసిన చంద్రబాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరం అని పేర్కొన్నారు. అందరి సలహాలు, సూచనలు తీసుకున్నాకే టీడీపీలో చేరానని గిరిధర్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమను నమ్ముకొని తమతో పాటు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వివరించారు.