Mekapati Chandrasekhar Reddy: సస్పెన్షన్ తర్వాత హాయిగా ఉంది: మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారంటూ నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్
- మంచి చేసినవారికి కూడా కొందరు చెడు చేస్తారన్న మేకపాటి
- రాజీనామా చేసి వస్తా... ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ సవాల్
ఏపీలో 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో 6 స్థానాలు వైసీపీ నెగ్గగా, మరోస్థానాన్ని సంచలనాత్మక రీతిలో టీడీపీ కైవసం చేసుకుంది. ఏడింటికి ఏడు స్థానాలు నెగ్గుతామని ధీమాగా ఉన్న వైసీపీ నాయకత్వానికి ఈ పరిణామం దిగ్భ్రాంతి కలిగించింది.
టీడీపీ బలం 19 మంది సభ్యులే కదా అని వైసీపీ తేలిగ్గా తీసుకోగా, టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు లభించాయి. దీనిపై అంతర్గత విచారణ జరిపిన వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటు వేసింది. తనపై పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
సస్పెన్షన్ వల్ల ఎంతో రిలాక్స్ గా ఫీలవుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎంతో ఆనందంగా ఉన్నానని తెలిపారు. మంచి చేసిన వారికి కూడా కొందరు చెడు చేస్తారని మేకపాటి వ్యాఖ్యానించారు. అనుకున్నది చేసేయడం వైసీపీలో అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్ కు మద్దతు ఇచ్చినందుకు పార్టీలో చాలా మర్యాదలు చేశారు అని వ్యంగ్యం ప్రదర్శించారు. తన నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారని తెలిపారు.
కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తా... ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. పార్టీ అగ్రనేతలకు మానవతా విలువలు అవసరం అని అన్నారు. తాజా పరిణామాలతో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల్లో గుసగుసలు మొదలయ్యాయని అన్నారు.