Karnataka: కొడుకు స్థానంలో పోటీ పడనున్న కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
- కర్ణాటకలో మొదలైన ఎన్నికల వేడి
- అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
- 124 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వెలువడనప్పటికీ రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఓ అడుగు ముందున్న కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఉన్నారు.
సిద్ధ రామయ్య.. తన కుమారుడికి చెందిన వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. మైసూరులోని వరుణ నియోజకవర్గానికి ప్రస్తుతం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడైన సిద్ధరామయ్య ప్రస్తుతం బాగల్‌కోట్ జిల్లాలోని బాదామి ఎమ్మెల్యేగా ఉన్నారు.
తొలి జాబితాలో ప్రకటించిన 124 మంది అభ్యర్థుల్లో 20 శాతం మంది లింగాయత్ నాయకులే కావడం గమనార్హం. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చితపూర్ నుంచి పోటీ చేయనున్నారు. బబలేశ్వర్, గాంధీనగర్ నియోజకవర్గాల నుంచి ఎంబీ పాటిల్, దినేష్ గుండూరావులకు టిక్కెట్లు ఇచ్చారు.
కాగా, కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 78 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు కైవసం చేసుకున్నాయి. 2019లో జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసింది. కానీ, కొన్నాళ్లకే సంకీర్ణ ప్రభుత్వం కూలగా.. బీజేపీ అధికారంలోకి వచ్చింది.