YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసు.. తులసమ్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పులివెందుల కోర్టు
- వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి
- ఈ హత్యతో తన భర్తకు సంబంధం లేదని ఆయన భార్య తులసమ్మ ప్రైవేట్ పిటిషన్
- వివేకా అల్లుడు, బావమరిదిని కూడా విచారించాలని కోర్టుకు విన్నపం
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టు నమోదు చేసింది. ఈ హత్యతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని... కేసు విచారణలో సీబీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కోర్టులో తులసమ్మ పిటిషన్ వేశారు.
ఈ కేసులో వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివప్రకాశ్ రెడ్డిని కూడా విచారించాలని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. గత నెల 21న పులివెందుల కోర్టులో ఆమె ప్రైవేటు కేసు వేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆమె వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టు నమోదు చేసింది. సాక్షిగా వివేకా పీఏ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.