Teja Nidamanuru: తేజ నిడమనూరు... నెదర్లాండ్స్ క్రికెట్ జట్టులో మన తెలుగోడు

Telugu cricketer Teja Nidamanuru playing for Nederlands

  • విజయవాడలో పుట్టిన తేజ
  • న్యూజిలాండ్ లో స్థిరపడిన కుటుంబం
  • కివీస్ దేశవాళీ క్రికెట్ ఆడిన తేజ
  • మెరుగైన భవిష్యత్ కోసం నెదర్లాండ్స్ వలస వెళ్లిన వైనం

భారత క్రికెట్ జట్టులో తెలుగు ఆటగాళ్ల ప్రాతినిధ్యం మొదటి నుంచి తక్కువే. తెలుగు రాష్ట్రాల క్రికెటర్లలో టీమిండియా వరకు ఎదిగి స్టార్ డమ్ అందుకున్నది కొందరే. సీకే నాయుడు నుంచి మొదలుపెడితే... అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు, ఎమ్మెస్కే ప్రసాద్, హనుమ విహారి, కేఎస్ భరత్ వరకు టీమిండియాకు ఆడాలన్న కల నెరవేర్చుకున్నారు. 

అయితే, ఓ తెలుగు కుర్రాడు విదేశీ జట్టుకు ఆడుతున్న వైనం తెలుగు వారిని ఆకర్షిస్తోంది. ఆ యువకుడి పేరు అనిల్ తేజ నిడమనూరు. పేరులోనే అచ్చ తెలుగుదనం ఉట్టిపడుతోంది. తేజ నిడమనూరు స్వస్థలం విజయవాడ. కుటుంబం న్యూజిలాండ్ లో స్థిరపడడంతో అక్కడే పెరిగాడు. ఆక్లాండ్ లోనే దేశవాళీ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. 

ఆ తర్వాత క్రికెట్లో మెరుగైన భవిష్యత్ కోసం నెదర్లాండ్స్ వలస వెళ్లిన తేజ అక్కడ ఓ స్థానిక జట్టులో ప్లేయర్ కమ్ కోచ్ గా చేరాడు. 28 ఏళ్ల తేజ ఆల్ రౌండర్. బ్యాటింగ్ తో పాటు ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. తన ప్రతిభతో నెదర్లాండ్స్ జాతీయజట్టులో స్థానం సంపాదించుకున్నాడు. గతేడాది వెస్టిండీస్ తో వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. 

తాజాగా జింబాబ్వేతో వన్డే సిరీస్ లో తేజ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో తేజ ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి సెంచరీ కొట్టడం హైలైట్. చేజింగ్ లో 96 బంతుల్లో 110 పరుగులు చేసి ఆ మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను గెలిపించాడు. 

ఓడిపోతుందనుకున్న డచ్ జట్టు ఈ మ్యాచ్ లో అనూహ్య రీతిలో విజయం అందుకుంది. అందుకు కారణం తేజ సూపర్ ఇన్నింగ్సే. తేజ ఇప్పటివరకు 11 అంతర్జాతీయ వన్డేలు, 6 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడాడు.

  • Loading...

More Telugu News