Krishna Vamsi: ఫ్యామిలీ సినిమాలు బాగా తీస్తానుగానీ .. పేరెంట్స్ తో అలా ఎప్పుడూ లేను: కృష్ణవంశీ
- హిట్ టాక్ తెచ్చుకున్న 'రంగమార్తాండ'
- కృష్ణవంశీకి దక్కుతున్న ప్రశంసలు
- పేరెంట్స్ తో అంత కనెక్టెడ్ గా లేనన్న కృష్ణవంశీ
- ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతానని వెల్లడి
క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణవంశీకి మంచి పేరు ఉంది. ఆయన సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'రంగమార్తాండ' ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆదరణ పొందుతోంది. ఈ మధ్య కాలంలో ఇంతగా ఏడిపించిన సినిమా లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో 'తెలుగు వన్'తో కృష్ణవంశీ మాట్లాడారు.
"ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ .. ఇంతకుముందు నేను చేసిన ఏ సినిమాకి కూడా రాలేదు. చిరంజీవిగారితో సహా అంతా కూడా ఈ సినిమా చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదని చెప్పారు. ఇక సోషల్ మీడియా నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నాకే ఆశ్చర్యం కలుగుతోంది. 'ఇది మన అమ్మానాన్నల కథ' అంటూ ఈ సినిమాను మొదలుపెట్టడంతో ఆడియన్స్ మరింత త్వరగా కనెక్ట్ అయ్యారు" అని అన్నారు.
"మా నాన్నగారు చాలా కాలం క్రితమే చనిపోయారు .. మా అమ్మ నాతోనే ఉంటుంది. నేను మా పేరెంట్స్ తో అంత కనెక్టెడ్ గా ఎప్పుడూ లేను. ఫ్యామిలీ సినిమాలు బాగా తీస్తానుగానీ .. ఒరిజినల్ గా నేను బ్యాడ్ సన్. ఇంట్లోను నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను. మొదటి నుంచి కూడా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను" అంటూ చెప్పుకొచ్చారు.