EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెరిగిన ఈపీఎఫ్ వడ్డీ రేటు
- 2022-23 సంవత్సరానికి 8.15 శాతం ఖరారు
- ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయం
- ఆర్థిక శాఖ ఆమోదంతో అమల్లోకి రానున్న పెంపు
- గత ఆర్థిక సంవత్సరానికి రేటు 8.10 శాతం
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తన సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2021-22 సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధిపై 8.10 శాతం వడ్డీ రేటును ఇవ్వగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) 8.15 శాతానికి వడ్డీ రేటును పెంచుతూ మంగళవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి ఈపీఎఫ్ జమలపై వడ్డీ రేటు 8.5 శాతంగా వుంది. అక్కడి నుంచి ఏకంగా 8.1 శాతానికి రేటును తగ్గించారు. ఇది దశాబ్ద కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.
1977-78 సంవత్సరానికి ఈపీఎఫ్ వో అతి తక్కువగా 8 శాతం వడ్డీ రేటును ఇచ్చింది. గతేడాది మే నుంచి ఆర్ బీఐ రెపో రేటుని 2.50 శాతం మేర పెంచింది. దీంతో బ్యాంకులు డిపాజిట్లు, రుణాల రేట్లను పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో స్వల్పంగా వడ్డీ రేటును పెంచినట్టు తెలుస్తోంది. ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం మంగళవారం ముగిసింది. డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు నిర్ణయాన్ని ఆర్థిక శాఖ పరిశీలనకు పంపుతారు. అక్కడ ఆమోదంతో ఖరారు అవుతుంది. అప్పటి నుంచి వీలైనప్పుడు వడ్డీని జమ చేస్తుంటారు.