Rahul Gandhi: ఆయన క్షమాపణ కోరినట్టు ఆధారాలు చూపించు!: రాహుల్ గాంధీకి సావర్కర్ మనవడి సవాల్
- క్షమాపణలు చెప్పేందుకు తాను సావర్కర్ కాదన్న రాహుల్
- దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సావర్కర్ మవనడు
- రాహుల్ చిన్న పిల్లాడి మాదిరిగా ప్రవరిస్తున్నారని విమర్శ
ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరిట రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయినా రాహుల్ వ్యాఖ్యల తీరు మారలేదు. తాను గతంలో మోదీ పేరిట చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదని.. బ్రిటిషర్లను క్షమాపణ వేడుకున్న సావర్కర్ మాదిరి తాను కాదని, తాను గాంధీ వారసుడినని రాహుల్ ప్రకటన చేశారు. దీనిపై బీజేపీతోపాటు శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
రాహుల్ వ్యాఖ్యలపై వినాయక్ దామోదర్ (వీడీ) సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ సీరియస్ గా స్పందించారు. బ్రిటిషర్లకు సావర్కర్ క్షమాపణ చెప్పినట్టు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. ‘‘రాహుల్ గాంధీ తాను సావర్కర్ ను కాదని, క్షమాపణలు చెప్పనని అంటున్నారు. సావర్కర్ క్షమాపణ కోరినట్టు ఆధారాలు చూపించాలి. దీనికి విరుద్ధంగా రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు రెండు సార్లు క్షమాపణలు చెప్పాడు. రాహుల్ గాంధీ చిన్న పిల్లాడి మాదిరిగా చేస్తున్నాడు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశభక్తుల పేర్లను వాడుకోవడం శోచనీయం’’ అని రంజిత్ సావర్కర్ పేర్కొన్నారు.