Grapes: ఔషధ గుణాల ద్రాక్ష.. ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం
- అన్ని పండ్లలోకి ద్రాక్ష ఉత్తమం అంటున్న ఆయుర్వేదం
- ద్రాక్షలో ఎన్నో పోషకాలు, పీచు, నీరు ఎక్కువ
- వేసవి సీజన్ లో అనుకూలమైన పండు
- సరైన రీతిలో కడిగిన తర్వాతే తినాలి
ద్రాక్ష పండ్లు తక్కువ ధరకే లభిస్తాయి. ముఖ్యంగా వేసవిలో ద్రాక్ష మార్కెట్ కు ఎక్కువగా వస్తుంటుంది. రుచితోపాటు, వీటిలో అధిక నీటి పరిమాణం ఉంటుంది. పీచు కూడా ఎక్కువే. కనుక ప్రతి ఒక్కరూ ఈ సీజన్ లో ద్రాక్ష పండ్లు తినడం ఎంతో మంచిదన్నది నిపుణుల సూచన. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో శరీర ఉష్ణోగ్రతను బ్యాలన్స్ చేయడానికి నీరు అవసరం పడుతుంది. కనుక ద్రాక్షను తినాలి. వేలాది సంవత్సరాల నుంచి ద్రాక్ష సాగు జరుగుతోంది. గ్రీన్, రెడ్, బ్లాక్, ఎల్లో, పింక్ రంగుల్లో ద్రాక్ష పలు ప్రాంతాల్లో విక్రయమవుతోంది.
ద్రాక్ష పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. ద్రాక్ష ఫలోత్తమం అని ఆయుర్వేదం చెబుతోంది. అంటే అన్ని పండ్లలోకి ఇది మంచి పండు అని అర్థం. రుచిని బట్టి ఏ రకం ద్రాక్ష అయినా తినొచ్చు. మన దగ్గర తీపి, కొంత పులుపుతో కూడిన ద్రాక్ష పండ్లు లభిస్తాయి.
మహిళలకు రుతు సమయంలో అధిక రక్తస్రావాన్ని ద్రాక్ష నియంత్రిస్తుంది. ముక్కు నుంచి రక్తం కారడాన్ని కూడా అడ్డుకుంటుంది. పిత్త దోషాన్ని బ్యాలన్స్ చేస్తుంది. శరీర కండరాలకు బలాన్నిస్తుంది. ఆస్థమా, శ్వాసకోస సమస్యలపై ఫలితం చూపిస్తుంది. మద్యపానం అలవాటు మానుకోవాలని కోరుకునే వారికి ద్రాక్ష కొంత ఫలితాన్నిస్తుంది. కాలేయ వ్యాధులను తగ్గిస్తుంది. మైకం, భ్రాంతిని తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను, మంటను తగ్గిస్తుంది. అధిక దాహాన్ని తీరుస్తుంది.
ద్రాక్ష సాగులో ఎన్నో పురుగు నివారణ మందులను స్ప్రే చేస్తుంటారు. కొన్ని పండ్లకు పైపొట్టు తీసి తినొచ్చు. కానీ ద్రాక్ష పండును మొత్తంగా తినేయాలి. కనుక పురుగు ముందుల ప్రభావం మనలోకీ చేరుతుంది. అందుకని ద్రాక్ష పండ్లు తినే ముందు సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని నీటిలో కొంత ఉప్పు వేయాలి. ద్రాక్ష పండ్లను గుత్తిగా కాకుండా విడదీసి ఆ నీటిలో వేసి కొంత సమయం ఉంచేయాలి. తర్వాత తాజా నీటితో మరోసారి కడగాలి.