Jagan: విశాఖ చేరుకున్న సీఎం జగన్... జీ-20 ప్రతినిధులతో సమావేశం
- విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ కు ఘనస్వాగతం
- రాడిసన్ బ్లూ హోటల్ కు చేరుకున్న సీఎం జగన్
- జీ-20 ప్రతినిధులతో గాలా డిన్నర్
- ఈ సమావేశం నుంచి మంచి ఆలోచనలు రావాలన్న సీఎం
- అవి రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడాలని ఆకాంక్ష
ఏపీ సీఎం జగన్ విశాఖపట్నం చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో సీఎం జగన్ కు వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడ్నించి ఆయన నేరుగా రాడిసన్ బ్లూ హోటల్ కు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గాలా డిన్నర్ కు సీఎం హాజరయ్యారు. ఇక, జీ-20 ప్రతినిధులతో సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధికి సుస్థిర విధానాలను సూచించాలని కోరారు.
"మీ నుంచి వచ్చే మంచి ఆలోచనలు సమస్యలకు పరిష్కారం చూపగలవని ఆశిస్తున్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నది మా ఆలోచన. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం... 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. ఈ గృహాలకు కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం. ఈ అంశంపై జీ-20 సదస్సులో చర్చించి మంచి సలహాలు, సూచనలు చేయాలని కోరుతున్నాం. మీరు విశాఖలో గడిపే సమయం చెరిగిపోని జ్ఞాపకంలా, మధురమైన అనుభూతిని మిగుల్చుతుందని ఆకాంక్షిస్తున్నా" అని తెలిపారు.