MS Dhoni: ఐపీఎల్‌లో ధోనీ ఇంకెన్నాళ్లు ఆడతాడో చెప్పిన రోహిత్ శర్మ

MS Dhoni is fit enough to play for 2 to3 more years says Rohit Sharma

  • ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్న జట్లు
  • ఈ నెల 31న గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి పోరు
  • ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ వార్తలను రెండుమూడేళ్లుగా వింటున్నానన్న రోహిత్
  • మరో రెండు మూడేళ్లు ఆడతాడన్న ముంబై స్కిప్పర్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న పొట్టిపండుగ మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ జట్లన్నీ ఇప్పటికే ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. తొలి మ్యాచ్ ఈ నెల 31న డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్ కాబోతున్నట్టు వస్తున్న వార్తలపై ముంబై ఇండియన్స్ స్కిప్పర్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు.

ధోనీ ఇప్పుడప్పుడే రిటైర్ కాబోడని, మరో రెండుమూడేళ్లు ఐపీఎల్ ఆడగలడని అన్నాడు. ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 2న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్‌లో తలపడుతుంది. ఈ నేపథ్యంలో నిన్న ముంబై ఇండియన్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రీ సెషన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. దీనికి రోహిత్ శర్మ, కోచ్ మార్క్ బౌచర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ధోనీకి ఇదే చివరి సీజన్ అన్న వార్తలను తాను రెండుమూడేళ్లుగా వింటున్నట్టు చెప్పాడు. అయితే, మరికొన్ని సీజన్లు ఆడేంత ఫిట్‌నెస్ ధోనీలో ఉందని అన్నాడు.  

చెన్నై జట్టులో ధోనీ ఇప్పటికీ కీలక ఆటగాడిగానే ఉన్నాడు. టోర్నీ ప్రారంభం నుంచి చెన్నైకి ఆడుతున్న ధోనీ 234 మ్యాచుల్లో 4,978 పరుగులు చేశాడు. నాలుగు టైటిళ్లు అందించాడు. ఐపీఎల్ 2023 తనకు చివరి సీజన్ అని ధోనీ గతంలో హింట్ ఇచ్చాడు. 2023లో దేశమంతా పర్యటించి అభిమానులకు గుడ్ బై చెప్పాలని ఉందని అప్పట్లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News