Girish Bapat: పుణే బీజేపీ ఎంపీ కన్నుమూత... విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

Modi condolences to the demise of BJP MP Girish Bapat
  • పుణే ఎంపీ గిరీశ్ బాపట్ మరణం
  • ఏడాదిన్నరగా అనారోగ్యంతో బాధపడుతున్న బాపట్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి
  • బాపట్ కష్టపడి పనిచేసే నేత అని కొనియాడిన మోదీ
  పుణే ఎంపీ, బీజేపీ నేత గిరీశ్ బాపట్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గిరీశ్ బాపట్ ఏడాదిన్నర కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. 

కాగా, తమ పార్టీ ఎంపీ గిరీశ్ బాపట్ మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. గిరీశ్ బాపట్ సమాజం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి అని, నిరాడంబరమైన వ్యక్తి అని కీర్తించారు. కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న నేత అని కొనియాడారు. మహారాష్ట్ర అభివృద్ధి ఆయనకు ప్రాధాన్యతా అంశం అని, పుణే ఉన్నతస్థాయిలో ఉండాలని ఎంతో కృషి చేశారని వివరించారు. 

మహారాష్ట్రలో బీజేపీని బలోపేతం చేసేందుకు నిర్మాణాత్మక సేవలు అందించారని,  అటువంటి నేత అందరినీ విడిచి వెళ్లిపోవడం బాధాకరమని మోదీ అభిప్రాయపడ్డారు. గిరీశ్ బాపట్ కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.  

గిరీశ్ బాపట్ గతంలో మహారాష్ట్ర మంత్రిగా పనిచేశారు. కస్బాపేట్ నియోజకవర్గం నుంచి 5 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేసి పుణే నుంచి గెలుపొందారు. కాగా, గిరీశ్ బాపట్ అంత్యక్రియలు ఈ సాయంత్రం నిర్వహించనున్నారు.
Girish Bapat
Demise
Narendra Modi
Condolence
MP
Pune
BJP
Maharashtra

More Telugu News