Pakistan: గోధుమపిండి కోసం తొక్కిసలాట.. పాకిస్థాన్‌లో 11 మంది మృతి!
- పాకిస్థాన్‌లో తీవ్ర ఆహార సంక్షోభం
- ట్రక్కులను వెంబడిస్తున్న వేలాదిమంది
- పంజాబ్ ప్రావిన్సులో ఉచిత పంపిణీ కేంద్రాల ఏర్పాటు
- గోధుమ పిండిని దక్కించుకునేందుకు పోటాపోటీ
ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గోధుమ పిండితో వస్తున్న ట్రక్కులు కనిపిస్తే చాలు వందలాదిమంది వెంబడిస్తూ గోధుమ పిండిని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల ఇక్కడ నిత్యకృత్యమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాకెక్కుతూ అక్కడి ఆహార సంక్షోభ తీవ్రతను ప్రపంచం కళ్లకు కడుతున్నాయి.
తాజాగా, గోధుమ పిండిని దక్కించుకునే క్రమంలో పంజాబ్ ప్రావిన్సులో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రజలకు ఉచితంగా గోధుమ పిండిని అందించేందుకు పలు ప్రాంతాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటి వద్ద ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఎవరికి వారే గోధుమ పిండిని దక్కించుకునేందుకు పోటీ పడడంతో తొక్కిసలాటలు జరుగుతున్నాయి.
దక్షిణ పంజాబ్‌లోని సాహివాల్, బహవల్‌పూర్, ముజఫర్‌గఢ్, ఒకారా, ఫైసలాబాద్, జెహానియన్, ముల్తాన్ జిల్లాల్లోని కేంద్రాల వద్ద ఈ తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేంద్రాల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండడంతోనే ఈ ఘటనలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు.
తొక్కిసలాట ఘటనలపై స్పందించిన పంజాబ్ కేర్‌టేకర్ ముఖ్యమంత్రి మోసిన్ నక్వీ కీలక ప్రకటన చేశారు. రద్దీని తగ్గించేందుకు ఉదయం ఆరు గంటల నుంచే కేంద్రాలను తెరుస్తామని, ప్రావిన్సు వ్యాప్తంగా ఉచిత పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.