Burundi: ఆఫ్రికాలో మిస్టరీ వ్యాధి కలకలం.. రోగులకు ముక్కులోంచి రక్తస్రావం
- ఆఫ్రికా దేశం బురుండీలో మిస్టరీ వైరస్ కలకలం
- వైరస్ బారినపడ్డ వారు త్వరగా మరణిస్తున్నట్టు వైద్య సిబ్బంది అనుమానం
- మిస్టరీ వైరస్ బయటపడ్డ ప్రాంతంలో క్వారంటైన్
ఆఫ్రికా దేశమైన బురుండీలో ఓ మిస్టరీ వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ బారిన పడ్డ ముగ్గురు ఇప్పటికే మరణించారు. బాధితుల ముక్కులోంచి రక్తస్రావం జరిగినట్టు వైద్యులు తెలిపారు. బెజీరో అనే చిన్న టౌన్లో ఈ కేసులు వెలుగు చేశాయి. ఈ వైరస్ బారిన పడ్డవారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు, తదితర లక్షణాలు కనిపించినట్టు అక్కడి వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ మిస్టరీ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. బెజీరో ప్రాంతంలో క్వారంటైన్ విధించారు. ఈ వైరస్ కారణంగా వేగంగా మరణాలు సంభవిస్తున్నట్టు అక్కడి నర్సులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన వారందరిలో అంతకు 24 గంటల మునుపు ముక్కులోంచి రక్తస్రావం జరిగినట్టు చెప్పారు.
గత నెలలో బురుండీకి పొరుగునున్న టాన్జానియా దేశంలో మార్బర్గ్ వైరస్ కేసులు వెలుగుచూశాయి. దీంతో.. పొరుగు దేశాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. తమ దేశంలో బయటపడ్డ వైరస్ మార్బర్గ్ లేదా ఇబోలా కాదని బురుండీ వైద్య శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.