TSPSC: అప్పు చేసి, భూమి తాకట్టు పెట్టి మరీ ఏఈఈ పేపర్ కొనుగోలు
- టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో వెలుగులోకి కీలక విషయాలు
- ప్రశ్నాపత్రం కొనడానికి అప్పు చేసినట్లు వెల్లడించిన నిందితులు
- మధ్యవర్తుల ద్వారా బేరసారాలు జరిపి పేపర్ కొనుగోలు చేసినట్లు వెల్లడి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసు దర్యాఫ్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుండగా.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పేపర్ కొనుగోలు చేసేందుకు నిందితులు అప్పులు చేసినట్లు వెల్లడించారు. మధ్యవర్తి ద్వారా బేరం కుదుర్చుకుని కొనుగోలు చేశారని అధికారులు చెప్పారు. లక్షల్లో వ్యవహారం కావడంతో అంత సొమ్ము లేక సొంతూరులోని భూములు తాకట్టుపెట్టి మరీ పేపర్ కొన్నారని వివరించారు.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..
కమిషన్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్ నుంచి రూ. 10 లక్షలు చెల్లించి ఏఈఈ పేపర్ ను రేణుకా దేవి, దాక్యా నాయక్ కొనుగోలు చేశారు. వాటిని నీలేష్ నాయక్, గోపాల్ నాయక్ లకు అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నారు. రాజేశ్వర్ నాయక్ ఈ డీల్ కు మధ్యవర్తిత్వం చేశాడు. పేపర్ అమ్మకానికి రూ.13.50 లక్షలకు బేరం కుదరగా.. అంత సొమ్ము లేకపోవడంతో నీలేష్ నాయక్, గోపాల్ నాయక్ తమ భూములు, నగలను తాకట్టు పెట్టి, కొంత అప్పు చేసి డబ్బులు సమకూర్చుకున్నారు.
వీరితో పాటు తిరుపతయ్య అనే మధ్యవర్తి ద్వారా రాజేందర్ కుమార్ కు రూ.5 లక్షలకు దాక్యా నాయక్ ఏఈఈ పేపర్ ను అమ్మాడు. ప్రశాంత్ కుమార్ అనే అభ్యర్థికి రూ.7.50 లక్షలకు అమ్మాడు. కాగా, ఈ నలుగురితో పాటు మరో 11 మందికి ఏఈఈ పేపర్ చేరిందని, వీరిలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఐదుగురి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.