Rahul Gandhi: రాహుల్ అనర్హతపై స్పందించిన జర్మనీ.. విదేశీ జోక్యాన్ని సహించబోమన్న భారత్

Germany Reacts To Rahul Gandhis Disqualification
  • రాహుల్ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని ఆశిస్తున్నామన్న జర్మనీ
  • ఆ దేశ స్పందనకు ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
  • విదేశీ శక్తులను ఆహ్వానించినందుకు రాహుల్ కు థ్యాంక్స్ అంటూ కిరణ్ రిజిజు ఎద్దేవా
  • భారత అంతర్గత విషయాల్లో విదేశీ జోక్యాన్ని సహించబోమని హెచ్చరిక
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీగా ఆయన్ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నాయి. లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో అనర్హత అంశంపై విదేశాలు స్పందించడం కలకలం రేపుతోంది. దీన్ని ప్రతిపక్షాలు స్వాగతిస్తుండగా.. అధికార బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 

తాజాగా రాహుల్ గాంధీ అనర్హత వ్యవహారంపై తాజాగా జర్మనీ స్పందించింది. జర్మనీ విదేశాంగ ప్రతినిధి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష, లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడం వంటి పరిణామాలను మేం నిశితంగా గమనిస్తున్నాం. మాకు తెలిసి.. రాహుల్‌ ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునే స్థితిలో ఉన్నారు. అప్పుడే ఈ తీర్పు నిలబడుతుందా? ఏ ప్రాతిపదికన అతనిపై అనర్హత పడిందన్నది స్పష్టమవుతుంది’’ అని చెప్పారు. ఈ కేసులో న్యాయ స్వతంత్రత ప్రమాణాలు, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని జర్మనీ ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల అమెరికా కూడా రాహుల్ అనర్హత వ్యవహారంపై స్పందించిన విషయం తెలిసిందే. ఏ ప్రజాస్వామ్యానికైనా చట్టబద్ధ నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత అనేవి మూల స్తంభాల్లాంటివని చెప్పింది. 

జర్మనీ స్పందనపై ధన్యవాదాలు చెబుతూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు. ‘‘రాహుల్ గాంధీని బాధించడం ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎలా రాజీ పడుతోందో గుర్తించినందుకు జర్మనీ విదేశాంగ శాఖ, రిచర్డ్ వాకర్ కు ధన్యావాదాలు’’ అని పేర్కొన్నారు.

దీంతో కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. తమ దేశ అంతర్గత విషయాల్లో విదేశీ జోక్యాన్ని భారత్ సహించబోదని స్పష్టం చేశారు. ‘‘భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు విదేశీ శక్తులను ఆహ్వానించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. కాకపోతే ఒక్క విషయం గుర్తుంచుకోండి.. విదేశీ జోక్యాలతో భారతీయ న్యాయవ్యవస్థ ప్రభావితం కాబోదు. భారతదేశం ఇకపై ‘విదేశీ ప్రభావాన్ని’ సహించదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ’’ అని ట్వీట్ చేశారు.
Rahul Gandhi
Disqualification
Germany
Congress
Kiren Rijiju

More Telugu News