sudden heart attacks: కరోనా తర్వాత ఆకస్మిక హార్ట్ ఎటాక్ లు.. అధ్యయనం చేస్తున్న ఐసీఎంఆర్

ICMR studying rise in sudden heart attacks after Covid 19 Union health minister Mansukh Mandaviya

  • హార్ట్ ఎటాక్ కారణంగా ఆకస్మిక మరణాల గురించి వింటున్నామన్న మంత్రి
  • దీనిపై తాను సైంటిస్టులతో మూడు సార్లు భేటీ అయినట్టు వెల్లడి
  • రెండు నెలల్లో ఐసీఎంఆర్ అధ్యయన ఫలితాలు వస్తాయని ప్రకటన

మనం గత రెండేళ్లుగా ఆకస్మిక హార్ట్ ఎటాక్ కేసుల గురించి ఎక్కువగా వింటున్నాం. ఫలానా సెలబ్రిటీ గుండె పోటుతో మరణించినట్టు, డ్యాన్స్ చేస్తుంటే కింద పడిపోయి మరణించినట్టు చాలా వార్తలే వెలుగులోకి వచ్చాయి. 18 ఏళ్ల కుర్రాళ్లు సైతం మరణించిన ఘటనలు ఉన్నాయి. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న పునీత్ రాజ్ కుమార్, మేకపాటి గౌతంరెడ్డి వంటి పలువురు సెలబ్రిటీలు సైతం అదే మాదిరి మరణించారు. దీనిపై రకరకాల అభిప్రాయాలు నెలకొన్నాయి. కరోనా సమయంలో గుండె వ్యవస్థపై పడిన ప్రభావంతో ఈ మరణాలు చోటు చేసుకుంటున్నాయని కొందరు అంటుంటే.. కరోనా నివారణకు ఇచ్చిన వ్యాక్సిన్ల కారణంగా మార్పులు జరిగి వస్తున్నవిగా కొందరు భావిస్తున్నారు.

ఈ ఆందోళనకరమైన అంశంపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ స్పందించారు. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనం మొదలు పెట్టినట్టు చెప్పారు. ఫలితాలు రెండు నెలల్లో వస్తాయని తెలిపారు. ‘‘హార్ట్ ఎటాక్ కారణంగా ఆకస్మిక మరణాలను చూస్తున్నాం. ఈ అంశంపై సైంటిస్టులతో నేను మూడు సార్లు భేటీ నిర్వహించాను. ఐసీఎంఆర్ సైతం అధ్యయనం చేపట్టింది. వ్యాక్సినేషన్, కోమార్బిడిటీ డేటా మా వద్ద ఉంది’’ అని మంత్రి వెల్లడించారు. కనుక ఐసీఎంఆర్ అయినా హార్ట్ ఎటాక్ కారణాలను వెలుగులోకి తీసుకొస్తుందని ఆశిద్దాం.

  • Loading...

More Telugu News