Nara Lokesh: ప్రజలు టీడీపీని ఎందుకు తిరస్కరించారని చాలా బాధపడ్డానన్న నారా లోకేశ్.. ఈనాటి పాదయాత్ర హైలైట్స్
- 55 రోజులను పూర్తి చేసుకున్న నారా లోకేశ్ పాదయాత్ర
- ఈరోజు 700 కిలోమీటర్లను పూర్తి చేసుకున్న యాత్ర
- రాప్తాడు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన లోకేశ్ కు పరిటాల సునీత, శ్రీరామ్ ఘన స్వాగతం
టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర 55వ రోజును పూర్తి చేసుకుంది. పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సంఘీభావం పలికారు. ఈ నాటి పాదయాత్రలో గుట్టూరు వద్ద పాదయాత్ర 700 కిలోమీటర్లను చేరుకుంది. ఈ సందర్భంగా గుట్టూరులో లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోరంట్ల, మడకశిర ప్రాంతాలకు తాగు, సాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా హంద్రీనీవా కాలువ నుంచి ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కియా ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగులు, సిబ్బందితో కొద్దిసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. గుట్టూరు హైవే సమీపంలో భోజన విరామ స్థలంలో కుంచిటిగ వక్కలిగ సామాజికవర్గీయులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.
సాయంత్రం సీకే పల్లి పంచాయితీ కోన క్రాస్ వద్ద పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మాజీమంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో రాప్తాడు నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు యువనేతకు ఘన స్వాగతం పలికారు. యువనేతపై పూలవర్షం కురిపించి బాణసంచా మోతలు, డప్పు శబ్ధాలతో హోరెత్తించారు. కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ పాదయాత్ర కోన క్రాస్ వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది.
మరోవైపు పాదయాత్రలో లోకేశ్ మాట్లాడుతూ... కియా వంటి మరెన్నో కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలను కల్పించాలనే బలమైన కోరిక ఏర్పడిందని చెప్పారు. కంపెనీలను తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులకు ఇస్తామని చెప్పారు. స్వయం ఉపాధి ద్వారా యువతకు జీవనోపాధిని, ఉద్యోగావకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువతకు అండగా నిలబడి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
చంద్రబాబు విజనరీ అని, విజనరీకి మారుపేరు చంద్రబాబు అని గూగుల్ లో వస్తుందని చెప్పారు. సమర్థులకే చంద్రబాబు మంత్రి పదవులను కట్టబెడతారని అన్నారు. చంద్రబాబు మరోసారి సీఎం అయ్యుంటే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చుండేవని చెప్పారు.
'అనంతపురం జిల్లా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. కియా పరిశ్రమను పెట్టాం. అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? అని చాలా బాధపడ్డాను. అందుకే నేను సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకున్నాను. దీని ద్వారా మేం ఏం చేశాం? వైసీపీ ఏం చేసింది? అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. పెనుకొండలో ఇన్ని కంపెనీలు వచ్చాయనే సంగతి నేను చూసేవరకు కూడా నాకూ పెద్దగా అవగాహన లేదు. కానీ వాటిని చూశాక ఇన్ని వందల కంపెనీలు ఇక్కడున్నాయా? అని నేను ఆశ్చర్యపోయాను' అని లోకేశ్ చెప్పారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని లోకేశ్ అన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన తర్వాతే జగన్ ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలని చెప్పారు. దోపిడీ సొమ్మంతా జగన్ వద్దే ఉందని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన అంశాలన్నీ జగన్ చుట్టూనే తిరుగుతున్నాయని... వివేకాను ఎవరు చంపారనే విషయంపై ఇప్పటికే ప్రజలకు అవగాహన వచ్చిందని అన్నారు. ఇప్పటి వరకు నారా లోకేశ్ 706.9 కిలోమీటర్లు నడిచారు. ఈరోజు 11.8 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది.