chandrababu: సమాధానం చెబుతావా జగన్?.. ‘కియా పరిశ్రమ’పై చంద్రబాబు సూటి ప్రశ్న
- కియా పరిశ్రమను వెనక్కి పంపేస్తామంటూ గతంలో జగన్ వ్యాఖ్యలు
- యువగళం పాదయాత్ర సందర్భంగా జగన్ పై లోకేశ్ ప్రశ్నల వర్షం
- లక్షల మందికి ఉపాధి కల్పించే కియా మోటర్స్ ఫేక్ గా కనిపిస్తోందా? అని ప్రశ్న
- ఈ వీడియోలను ట్వీట్ చేసిన చంద్రబాబు.. సమాధానం చెప్పాలని నిలదీత
కియా ఫ్యాక్టరీపై గతంలో చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెబుతారా? అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కియాపై జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలు, యువగళం పాదయాత్ర సందర్భంగా కియా పరిశ్రమ వద్ద లోకేశ్ చేసిన చాలెంజ్‌ను ప్రస్తావిస్తూ వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు.
పాదయాత్ర సమయంలో జగన్ మాట్లాడిన వీడియోలో ‘‘ఈ ఒక్క సంవత్సరం ఆగండి.. ఆపే కార్యక్రమం చేద్దాం. ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా తీసుకునే కార్యక్రమం చేశారు. ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా ఆ ఫ్యాక్టరీని వెనక్కు పంపే కార్యక్రమం చేస్తాం’’ అని చెప్పారు.
దీనికి నిన్న నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నాడు కియా ఫ్యాక్టరీని జగన్ ఫేక్ అన్నారు. భూదందా కోసం తీసుకున్నామని చెప్పారు. ఉద్యోగాలు రావని అన్నారు. భూములను రైతులకు తిరిగి ఇస్తామన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ఇప్పుడు అడుగుతున్నా నేను.. ఇది ఫేకా? కియా మోటర్స్ మీకు ఫేక్ గా కనిపిస్తోందా? 25 వేల మంది పని చేస్తుండటం ఫేకా? వందల యూనిట్లు బయటికి వస్తుండటం ఫేకా? లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తుండటం ఫేకా? అని సూటిగా ప్రశ్నిస్తున్నా’’ అని అందులో అడిగారు.
జగన్, లోకేశ్ మాట్లాడిన వీడియోలను కలిపి షేర్ చేసిన చంద్రబాబు.. ‘‘సమాధానం చెబుతారా జగన్?’’ అని ప్రశ్నించారు. ‘లోకేశ్ అట్ కియా’ అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేశారు.