Sathya Kumar: అమరావతి రైతులకు సంఘీబావం తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేత సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి

Attack on BJP leader Sathya Kumar car
  • అమరావతి రైతుల ఉద్యమానికి 1200 రోజులు
  • సంఘీభావం తెలిపిన సత్యకుమార్
  • ఆందోళనకారుల దాడిలో కారు అద్దాలు ధ్వంసం
  • పథకం ప్రకారమే దాడి జరిగిందన్న సత్యకుమార్
రాజధాని అమరావతి రైతుల పోరాటానికి 1200 రోజులు కాగా, రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేత సత్యకుమార్ కారుపై అమరావతి ప్రాంతంలో రాళ్ల దాడి జరిగింది. రైతుల దీక్ష శిబిరం నుంచి సత్య కుమార్ తుళ్లూరులో బీజేపీ కార్యకర్తలను కలిసేందుకు వెళుతుండగా, ఉద్ధండరాయునిపాలెం వద్ద ఆయన కారును ఆందోళనకారులు అడ్డుకున్నారు. 

మూడు రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కారుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాంతో సత్యకుమార్ కారు డ్రైవర్ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు. 

దీనిపై సత్యకుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై దాడి పక్కా పథకం ప్రకారం జరిగిందని వెల్లడించారు. తన కారుపై రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. కారుపై దాడి చేస్తుంటే చూస్తూ ఉన్నారేంటని తాము ప్రశ్నిస్తే, తమ వాళ్లనే పోలీసులు నెట్టివేశారని సత్యకుమార్ తెలిపారు. దాడిపై డీఎస్పీ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇలాంటి దాడులకు జగన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. 

ఇవాళ రైతులను కలిసి సంఘీభావం తెలిపేందుకు పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా వచ్చారని సత్యకుమార్ వెల్లడించారు. అసలు, తన వాహనాన్ని పోలీసులే ఆపారని, ఎందుకు ఆపారని అడిగే లోపు వైసీపీ గూండాలు తన వాహనంపై దాడి చేశారని వివరించారు.
Sathya Kumar
Car
Attack
BJP
Amaravati

More Telugu News