KVP Ramachandra Rao: వైఎస్సార్ కు దగ్గరగా ఉన్న నేను... జగన్ కు ఎందుకు దూరంగా ఉంటున్నానో చెపుతా: కేవీపీ రామచంద్రరావు
- జగన్ కు దూరంగా ఎందుకుంటున్నానో ఏరోజైనా చెప్పాల్సిందేనన్న కేవీపీ
- ఉన్మాద మనస్తత్వం కలిగిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నామని వ్యాఖ్య
- అదానీ నుంచి మోదీకి వాటా వెళ్తోందని ఆరోపణ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మబంధువుగా పేరుగాంచిన వ్యక్తి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న కేవీపీ... తన అల్లుడిగా భావించే ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన దీనిపై స్పందిస్తూ... వైఎస్ కు దగ్గరగా ఉన్న తాను జగన్ కు దూరంగా ఎందుకు ఉంటున్నాననే విషయం గురించి త్వరలోనే చెపుతానని అన్నారు. ఇప్పుడే దీనిపై మాట్లాడనని... కానీ ఎప్పటికైనా ఈ విషయం గురించి మాట్లాడాల్సిందేనని... మరో రోజు మీడియా ముఖంగా అన్ని విషయాలను వివరిస్తానని చెప్పారు.
మరోవైపు కేంద్రంలోని బీజేపీపై ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. ఉన్మాద మనస్తత్వం కలిగిన ఒక ప్రభుత్వాన్ని మనం ఎదుర్కొంటున్నామని చెప్పారు. మన దేశ అప్పులు లక్షల కోట్లు పెరుగుతుంటే... అదానీ ఆస్తులు మాత్రం భారీగా పెరుగుతున్నాయని అన్నారు. అదానీని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద పరిగణిస్తున్నారని... ఒక పెద్ద అవినీతిపరుడిని ప్రశ్నిస్తే దేశ ద్రోహం అవుతుందా? అని అడిగారు. అదానీ నుంచి మోదీకి వాటా వెళ్తోందని ఆరోపించారు.