Botsa Satyanarayana: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు, కేబినెట్ లో మార్పులకు సంబంధమేంటి?: మంత్రి బొత్స
- కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనేది సీఎం విచక్షణాధికారమన్న బొత్స
- ఈ విషయంపై ఊహాగానాలు సరి కాదని వ్యాఖ్య
- పరిపాలన సౌలభ్యం కోసం మార్పులు, చేర్పులు జరుగుతుంటాయని వెల్లడి
- ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి తన వైఫల్యమే కారణమన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మార్పులు జరుగుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పరిపాలనా సౌలభ్యం కోసం కేబినెట్ ఏర్పాటు ఉంటుందని అన్నారు. కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనేది సీఎం విచక్షణాధికారమని, ఆయన ఇష్టమని చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం మార్పులు, చేర్పులు ఉంటాయని తెలిపారు. ఈ విషయంపై ఊహాగానాలు సరి కాదని, తనలాంటి మంత్రులు మాట్లాడటం సమంజసం కాదని అన్నారు.
ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు, మంత్రి వర్గంలో మార్పులకు సంబంధం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ‘‘ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి నా వైఫల్యమే కారణం. లోపం ఎక్కడుందో సమీక్షించుకుంటాం. ఓటమిని వేరేవారిపైకి నెట్టడం నా రాజకీయ జీవితంలో అలవాటు లేదు. నేను పారిపోయే వాడిని కాదు’’ అని బొత్స సత్యనారాయణ చెప్పారు.
విశాఖపట్నం నుంచి రేపటి నుంచే పాలన ప్రారంభం కావాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. వికేంద్రీకరణ తమ పార్టీ, ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు ఇంకా దిగజారిపోతారని బొత్స విమర్శించారు. అసలు ప్రభుత్వాన్ని ముందుగా రద్దు చేయాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు.