ChatGPT: చాట్‌జీపీటీతో యువకుడికి రూ.28 లక్షల ఆదాయం!
- చాట్‌జీపీటీ వినియోగంపై వీడియో కోర్సు ప్రారంభించిన అమెరికా యువకుడు
- యూడెమీ యాప్‌లో అతడి కోర్సుకు అనూహ్య స్పందన
- భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు, లక్షల్లో ఆదాయం
- చాట్‌జీపీటీపై అపోహలు తొలగించడమే తన లక్ష్యమంటున్న యువకుడు
ప్రస్తుతం కృత్రిమ మేథ రంగంలో చర్చ అంతా చాట్‌జీపీటీ చుట్టూ తిరుగుతోంది. ఆసాధారణ సామర్థ్యం గల ఇలాంటి ఏఐ అప్లికేషన్లతో కలిగే ప్రమాదాల గురించి కూడా చర్చ మొదలైంది. అయితే, కృత్రిమ మేథపై పరిశోధనలకు కొంత విరామం ఇవ్వాలని, ప్రస్తుత పరిస్థితులను, రాబోయే పరిణామాలను నిశితంగా బేరీజు వేసుకోవాలని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ కొత్త సాంకేతికతను ఓ అమెరికా యువకుడు ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. ఇప్పటివరకూ ఏకంగా రూ.23 లక్షలను(మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) సంపాదించాడు.
ఆస్టిన్ రాష్ట్రానికి చెందిన లాన్స్ జంక్ గతేడాది నవంబర్‌లో తొలిసారిగా చాట్‌జీపీటీని చూశాడు. ఆ తరువాత చాట్‌జీపీటీ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఈ చాట్‌బాట్ అసాధారణ సామర్థ్యాలు చూసి అతడి ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. అయితే, చాట్‌జీపీటీ ఉపయోగాలపై యువతలోనూ అవగాహన లోపించడం అతడిని ఆలోచనలో పడేసింది. ఈ సాంకేతికతపై ప్రజల్లో భయాలు, అపోహలు ఉన్న విషయాన్ని గుర్తించాడు. దీంతో.. ప్రజల్లో అవగాహన పెంచేందుకు యూడెమీ ప్లాట్ ఫాంలో చాట్‌జీపీటీ మాస్టర్ క్లాస్ పేరిట వీడియో తరగతుల సిరీస్‌ను ప్రారంభించాడు.
ఈ కోర్సుకు ప్రజల నుంచి అతడు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. 20 ఏళ్ల వయసున్న యువత నుంచి 50వ పడిలో ఉన్న వారివరకూ అనేక మంది ఈ కోర్సులో చేరారు. అమెరికాతో పాటూ కెనడా, ఇండియా వారు కూడా ఈ కోర్సును సబ్‌స్క్రైబ్ చేశారు. దీంతో, అతడిపై కనకవర్షం కురవడం ప్రారంభమైంది. దీంతో అతడి ఆనందానికి అంతేలేకుండా పోయింది. చాట్‌జీపీటీపై అపోహలను తొలగించి దీన్ని ప్రజలకు మరింత దగ్గర చేయడమే తన లక్ష్యమని లాన్స్ చెప్పుకొచ్చాడు.