Team India: తొలి తరం దిగ్గజ క్రికెటర్ కన్నుమూత
- అనారోగ్యంతో కన్నుమూసిన సలీమ్ దురానీ
- కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న మాజీ ఆల్ రౌండర్
- భారత్ తరఫున 29 టెస్టులు ఆడిన సలీమ్
భారత తొలి తరం దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన మాజీ ఆటగాడు, స్పిన్ ఆల్‌రౌండర్ సలీమ్ దురానీ ఇక లేరు. ఆదివారం ఆయన కన్నుమూశారు. 88 ఏళ్ల దురానీ చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం గుజరాత్‌లో జామ్‌నగర్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జనవరిలో కింద పడిపోవడంతో దురానీ తొడ ఎముక విరగ్గ శస్త్ర చికిత్స జరిగింది. దురానీ.. 1971లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ చారిత్రక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. భారత్ తరఫున దురానీ 29 టెస్టు మ్యాచ్‌లు ఆడి ఒక శతకం, 7 అర్ధ సెంచరీలతో మొత్తం 1,202 పరుగులు చేశారు. అదేవిధంగా 75 వికెట్లు పడగొట్టారు. 1961-62లో ఇంగ్లండ్ తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ను భారత్ 2-0తో గెలవడంలోనూ కీలక పాత్ర పోషించారు.
దురానీ 1934, డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ లో జన్మించారు. తన 8 నెలల వయసులో ఆయన కుటుంబం కరాచీకి వలస వచ్చి స్థిరపడింది. 1947లో భారత్-పాక్ విభజన అనంతరం దురానీ కుటుంబం భారత్‌కు వచ్చేసింది. 1960లో ముంబైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో భారత్ తరఫున అరంగేట్రం చేశారు. 1960-70 దశకంలో భారత జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా గుర్తింపుపొందారు. 1973లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దురానీ తర్వాత బాలీవుడ్‌లో అడుగు పెట్టారు.. నటుడు ప్రవీన్ బాబీతో కలిసి ‘చరిత్ర’ సినిమాలో పనిచేశారు. అర్జున అవార్డును అందుకున్న తొలి క్రికెటర్ సలీమ్ దురానీ (1960)నే కావడం విశేషం. దురానీ మృతిపట్ల మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రవిశాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్ సంతాపం ప్రకటించారు.