Perni Nani: వై నాట్ పులివెందుల అంటున్న వారికి ఇదే మా ఆహ్వానం: పేర్ని నాని
- పేర్ని నాని ప్రెస్ మీట్
- టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించిన మాజీ మంత్రి
- 4 సీట్లు గెలిచి ఎవరెస్ట్ ఎక్కినట్టు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా
- జన్మలో గెలుపు చూడలేమన్నట్టుగా టీడీపీ నేతల వైఖరి ఉందని వ్యంగ్యం
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. 21 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగితే 4 గెలిచారని, ఆ మాత్రానికే ఎవరెస్ట్ ఎక్కినట్టుగా భావిస్తున్నారని, ఇక జన్మలో గెలుపు చూడలేరనే భావనతో సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీపై వ్యంగ్యం ప్రదర్శించారు.
175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు. అసలు, 175 నియోజకవర్గాల్లో బరిలో దింపేందుకు అభ్యర్థులు ఉన్నారా? అని ప్రశ్నించారు. టీడీపీకి 38 నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులే లేరని అన్నారు. పదిమందిని కలుపుకుంటే కానీ పోటీ చేయలేని పరిస్థితి చంద్రబాబుది అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా, ఎంతమందిని పోగేసుకొచ్చినా జగన్ ను ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.
"175 నియోజకవర్గాల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు? బీజేపీలో ఉండి టీడీపీ జెండా మోస్తున్న వారికి ఎన్ని సీట్లు ఇస్తున్నారు?" అని నిలదీశారు. వై నాట్ పులివెందుల అంటున్నారని, అలాంటి వారందరికీ ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. మరి చంద్రబాబు, పవన్ కు పులివెందులలో పోటీ చేసే దమ్ముందా? అని పేర్ని నాని సవాల్ విసిరారు. పులివెందులలో పోటీ చేస్తే మీరో, మేమో తేలిపోతుంది అని స్పష్టం చేశారు.
2024లో మళ్లీ జగన్ ప్రభుత్వమే రాబోతోందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఐదేళ్ల పాలనకు ప్రజలు తమకు అవకాశం కల్పించారని, కచ్చితంగా 2024 మార్చి తర్వాతే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా కార్యకర్తలు కలిసిరావడంలేదని, అందరూ వ్యతిరేకమైపోతున్నారని పేర్ని నాని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయని హడావుడి చేస్తే అయినా కార్యకర్తలు వస్తారేమోనని చంద్రబాబు ఆలోచన అని వివరించారు.
ఇక, మంత్రులను తొలగించనున్నారన్న ప్రచారంపైనా పేర్ని నాని వివరణ ఇచ్చారు. రేపు సీఎం జగన్ అధ్యక్షతన గడప గడపకు కార్యక్రమంపై సమీక్ష మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రులను మార్చేస్తారనేది టీఆర్పీ రేటింగ్ లు, వ్యూయర్ షిప్ ల కోసం కొందరు చేసే ప్రచారం అని కొట్టిపారేశారు.