cars: కార్లు తెగ కొంటున్న జనాలు.. విక్రయాల్లో రికార్డు బ్రేక్

Record car sales in FY23

  • 2023 ఆర్థిక సంవత్సరంలో 38.89 లక్షల వాహనాల విక్రయం
  • ప్యాసింజర్ వాహనాల విభాగంలో 2019లో అత్యధికంగా అమ్ముడై రికార్డు బ్రేక్
  • వీటిలో ఎస్ యూవీల వాటానే 43 శాతం

మన దేశంలో సొంత కారు చాలా మంది కల. గత కొన్నేళ్లుగా మధ్య తరగతి కుటుంబాలు కూడా సొంత కారు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దాంతో, ప్యాసింజర్ వాహనాల (పీవీ) విభాగంలో 2023 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలు జరిగాయి. మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా దేశీయ విపణిలో రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి. 38,89,545 యూనిట్ల వాహనాలను అందించి దేశీయ మార్గెట్ లో రికార్డు సృష్టించాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో 33,77,436 విక్రయాల రికార్డును అధిగమించాయి. 
 
పీవీ సెగ్మెంట్ లో గతేడాది 30,69,499 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. ఈసారి 26.72 శాతం వృద్ధి నమోదైంది. 2023 అర్థిక సంవత్సరంలో పీవీ విభాగంలో అత్యధికంగా స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్ యూవీ) అమ్ముడయ్యాయి. ఈ విభాగంలో 43.02 శాతం వాటాతో 16,73,488 యూనిట్లను ఆయా సంస్థలు వినియోగదారులకు అందించాయి. 2019లో ఎస్ యూవీ వాహనాలు 7,83,119 యూనిట్లతో పీవీ విభాగంలో 23.19 శాతం అమ్ముడయ్యాయి. మూడేళ్లలో అది రెట్టింపు కావడం గమనార్హం. కరోనా అనంతర డిమాండ్ తో పాటు పలు కొత్త మోడళ్లు అందుబాటులోకి తేవడంతో ఈ ఏడాది ప్రారంభంలో కార్లకు భారీ డిమాండ్ ఏర్పడిందని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు.
 
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా 2023 ఆర్థిక సంవత్సరంలో 16,06,870 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను అందించి అగ్రస్థానంలో ఉండగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో 5,67,546 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు 5,38,640 యూనిట్లతో టాటా మోటార్స్ ఓ ఆర్థిక సంవత్సరంలో తమ అత్యధిక ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. ఫిబ్రవరి వరకు 3,23,256 యూనిట్లతో నిలిచిన మహీంద్రా అండ్ మహీంద్రా 3,50,000 యూనిట్లతో ఈ ఆర్థిక సంవత్సరాన్ని ముగించనుంది. కియా కార్ల వినియోగంలోనూ ప్రతి ఏడాది వృద్ధి కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కియా అత్యధికంగా 2,69,229 యూనిట్లను ఉత్పత్తి చేసింది.

  • Loading...

More Telugu News