Balagam: రాజకీయ ‘బలగం’.. పల్లెల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు!
- తెలంగాణ పల్లెల్లో బలగం సినిమా గురించే చర్చ
- దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న నేతలు
- ‘కార్యకర్తలే బలం.. ప్రజలే మా బలగం’ అంటూ పోస్టర్లు
కమెడియన్ ప్రియదర్శి కీలక పాత్రలో.. దర్శకుడిగా మారిన మరో కమెడియన్ వేణు యెల్దండి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. సున్నితమైన కామెడీ, బలమైన భావోద్వేగాల కలబోతతో వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
తెలంగాణ పల్లెల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సినిమా గురించే చర్చ. దీంతో ఈ ‘ట్రెండ్’ను రాజకీయ నాయకులు క్యాష్ చేసుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తమ ప్రచారానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో సినిమా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. మూవీ టైటిల్, థీమ్‌తో రాజకీయ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
‘పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలే మా బలగం’ అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేస్తున్న పోస్టర్లు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మెదక్ జిల్లాలో నియోజవకర్గాల్లో ఇలాంటి బ్యానర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డితో పాటు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పలువురు నేతలు ఇలాంటి బ్యానర్లను తమ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశారు.
సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, ఇతర నేతలు కూడా ఇలాంటి పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎమోషనల్‌గా ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు బలగం సినిమాను వాడుకుంటున్నారు. ‘కార్యకర్తలే నా బలం.. ప్రజలే నా బలగం’ అంటూ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఫొటోతో మెదక్ జిల్లాలో ఫ్లెక్సీలు వెలిశాయి.