Nara Lokesh: నీ యాక్టింగ్ మా కరకట్ట కమల్ హాసన్ ను మించిపోతోంది: కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు

Lokesh satires in Kethireddy

  • ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో లోకేశ్ పాదయాత్ర
  • ఉత్సాహంగా యువగళం
  • ఎస్కే వర్సిటీ వద్ద లోకేశ్ కు ఘనస్వాగతం
  • కృష్ణంరెడ్డిపల్లిలో మహిళలతో ముఖాముఖి
  • లోకేశ్ ను చూస్తే బాధగా ఉందన్న పరిటాల సునీత

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 59వ రోజు (సోమవారం) ధర్మవరం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోలాహలంగా సాగింది. భారీ సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా యువగళం పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఎస్కే యూనివర్సిటీ వద్ద యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. యువనేతపై పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ధర్మవరం నియోజకవర్గం ముష్టూరు క్యాంప్ సైట్ లో సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమంలో సుమారు వెయ్యిమందికి పైగా అభిమానులతో ఫోటోలు దిగిన యువనేత... అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. 

గుడ్ మార్నింగ్ కేటు... నీ రూటే సపరేటు!

లోకేశ్ సోమవారం నాటి పాదయాత్ర దారిలో ఇసుకను తరలిస్తున్న ఓ లారీని చూసి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిపై సెటైర్లు వేశారు. 

"ప్రతీరోజూ ధ‌ర్మవ‌రం వీధుల్లో నీ యాక్టింగ్ మా మంగ‌ళ‌గిరి క‌ర‌క‌ట్ట క‌మ‌ల్ హాస‌న్‌ని మించిపోతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఏ అక్రమం అడ్రస్ లాగినా నీ ద‌గ్గరే తేలుతోంది. ఏ క‌బ్జా క‌దిపినా గుడ్ మార్నింగ్ కేటురెడ్డిదేన‌ని స్పష్టం అవుతోంది. చిత్రావ‌తి న‌ది ఉప్పల‌పాడు రీచ్ నుంచి త‌ర‌లించే టిప్పర్లన్నీ కేటువేనంటున్నారు. మ‌న గుడ్ మార్నింగ్ షూటింగ్‌లో ఎర్రగుట్ట క‌బ్జా, చెరువు పూడ్చి ఫాంహౌస్ క‌ట్టుకోవ‌డం, వంద‌ల ఎక‌రాల క‌బ్జా, చిత్రావ‌తి న‌ది నుంచి ఇసుక మాఫియా ఎపిసోడ్ల స్కిట్ల షూట్‌కి ఎప్పుడూ ప్లాన్ చేయ‌లేదా?" అంటూ చురకలంటించారు.

నారా లోకేశ్ ని క‌లిసి కృత‌జ్ఞత‌లు తెలియ‌జేసిన త‌గ‌ర‌కుంట ప్రభాక‌ర్ కుమార్తె శ్రావ‌ణి

సీమ ఫ్యాక్షన్ క‌క్షల‌కు నాడు త‌గ‌ర‌కుంట ప్రభాక‌ర్ బ‌లైపోయారు. అనాథ‌లైన పిల్లల బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ప్రభాక‌ర్ కుటుంబంలో ఆరుగురు పిల్లలని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో న‌డిచే ఎన్టీఆర్ మోడ‌ల్ స్కూలులో చేర్పించారు. అంద‌రూ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. వీరిలో న‌లుగురు సాఫ్ట్ వేర్ జాబ్స్ చేస్తున్నారు. అంద‌రి కంటే చిన్న అమ్మాయి శ్రావ‌ణి బెంగ‌ళూరులో జాబ్ సంపాదించి, వ‌ర్క్ ఫ్రం హోం చేస్తోంది. యువ‌గ‌ళం పాద‌యాత్రలో నారా లోకేశ్ ని క‌లిసి త‌మ కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి, విద్యాబుద్ధులు నేర్పించిన ఎన్టీఆర్ మోడ‌ల్ స్కూల్‌కి రుణ ప‌డి ఉంటామ‌ని కృత‌జ్ఞత‌లు తెలియ‌జేసింది. 

ఓ తల్లిగా బాధపడుతున్నా: పరిటాల సునీత

పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ ఇవాళ కృష్ణంరెడ్డిపల్లిలో మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత పరిటాల సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో ఎండను సైతం లెక్కచేయకుండా యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేశ్ కు మహిళలందరి తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా, వాటిని లెక్క చేయకుండా మండుటెండలో ముందుకే కొనసాగుతున్నారని కొనియాడారు. 

"లోకేశ్ ఎండలో నడుస్తుంటే ఓ తల్లిగా నాకు చాలా బాధగా ఉంది. సుఖసంతోషాలను వదిలిపెట్టి రాష్ట్రం కోసం ప్రజాక్షేత్రంలోకి రావడం చాలా అభినందనీయం" అని వివరించారు.

యువనేతను కలిసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం సంజీవపురంలో ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు లోకేశ్ ను కలిశారు. అనంతపురానికి టీడీపీ హయాంలో ఆటోమొబైల్ పరిశ్రమలు, టెక్స్ టైల్స్ పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించారని, అదే విధంగా ఐటీ కంపెనీలు కూడా అనంతపురానికి తీసుకురావాలని కోరుకుంటున్నాం అని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు లోకేశ్ ను కోరారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... టీడీపీ హయాంలో ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డాం అని వెల్లడించారు. "తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకను కాదని మీ రాష్ట్రానికి ఎందుకు రావాలి అని అడిగే వారు. వాళ్ళకి నేను ఒకటే చెప్పేవాడిని, మీ కంపెనీల్లో పనిచేస్తున్న ఎక్కువ శాతం మంది ఏపీ వాళ్ళే ఉన్నారు కాబట్టి, మా రాష్ట్రంలో సెంటర్ ఏర్పాటు చెయ్యాలని అడిగేవాడిని. ఈసారి టీడీపీ గెలిచిన మొదటి వంద రోజుల్లోనే పెద్ద ఎత్తున కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నిరకాల పరిశ్రమలను పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొస్తాం" అని భరోసా ఇచ్చారు.

లోకేశ్ కు సంఘీభావం ప్రకటించిన ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు

రాప్తాడు సమీపంలోని ఎస్కే యూనివర్సిటీ వద్ద ఎఐఎస్ఎఫ్ కు చెందిన విద్యార్థులు లోకేశ్ కు సంఘీభావం తెలిపి, తమ సమస్యలు విన్నవించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 5,045 బోధన, బోధనేతర పోస్టులు భర్తీచేయాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రద్దుచేసి పాత పద్ధతిలోనే ఆయా యూనివర్సిటీల పరిధిలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. 

"పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ రద్దుచేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.77ని రద్దుచేసి పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని తీసుకురావాలి. కరోనా కారణంగా 2019-21 నడుమ విద్యార్థులకు హాజరు శాతం తగ్గింది. ఈ సాకుతో వీసీ రామకృష్ణారెడ్డి 400 మంది విద్యార్థులను డిటైన్ చేశారు. డిటైన్ చేసిన విద్యార్థులను యథావిధిగా కొనసాగించి పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాలి. అర్హతలు లేకుండా వీసీగా నియమితుడై నియంతలా వ్యవహరిస్తున్న వీసీ రామకృష్ణారెడ్డిని రీకాల్ చేయాలి" అని కోరారు. 

దీనిపై లోకేశ్ స్పందించారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాల్లో సొంత మనుషులను చొప్పించి ఉన్నత విద్యావ్యవస్థను జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని విమర్శించారు. పీజీ విద్యార్థులకు గొడ్డలిపెట్టులా మారిన జీవో నెం.77ను రద్దు చేసి పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని పునురుద్ధరిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, రాజకీయాలతో సంబంధం లేని ఉన్నత విద్యావంతులను వీసీలుగా నియమిస్తాం. కరోనా సమయంలో హాజరుశాతం లేక డిటైన్ కు గురైన విద్యార్థుల అడ్మిషన్ పునరుద్దరించి పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తాం" అని స్పష్టం చేశారు.

====

యువగళం పాదయాత్ర వివరాలు:

ఇప్పటి వరకు నడిచిన దూరం 760.1 కి.మీ.

ఈరోజు నడిచిన దూరం 14.3 కి.మీ.

60వరోజు (4-4-2023) యువగళం పాదయాత్ర వివరాలు:

అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం

ఉదయం

8.30 – రాప్తాడు పంచాయితీ పనగల్ రోడ్డులోని క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.30 – అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.

10.15 – అనంతపురం టీవీ టవర్ వద్ద ఆర్డీటి సెంటర్ సందర్శన.

మధ్యాహ్నం

12.05 – విజయనగర్ కాలనీలో భోజన విరామం.

సాయంత్రం

4.00 – విజయనగర్ కాలనీలో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.

5.15 – జ్యోతిరావ్ పూలే సర్కిల్ లో వాల్మీకి, రజకులతో భేటీ.

5.25 – అంబేద్కర్ నగర్ సర్కిల్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

5.35 – పవర్ హౌస్ సర్కిల్ లో ముస్లింలతో ఆత్మీయ సమావేశం.

5.45 – బసవన్న గుడి వద్ద ఆర్యవైశ్య సామాజిక వర్గీయులతో భేటీ.

5.55 – విజయ క్లాత్ సెంటర్ లో కురుబ సామాజికవర్గీయులతో సమావేశం.

6.05 – సూర్యనగర్ లో మద్దెర సామాజికవర్గీయులతో మాటామంతీ.

6.15 – సప్తగిరి సర్కిల్ లో నాయీబహ్మాణులతో భేటీ.

6.25 – చర్చిసర్కిల్ లో క్రిస్టియన్ సామాజికవర్గీయులతో సమావేశం.

6.35 – అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.

6.50 – శివరామకృష్ణ సర్కిల్ లో స్థానికులతో మాటామంతీ.

రాత్రి

7:05 – గవర్నమెంట్ హాస్పటల్ సెంటర్ లో స్థానికులతో సమావేశం.

8:00 – రుద్రంపేట బైపాస్ లో స్థానికులతో భేటీ.

8.35 – నూర్ బాషా ఫంక్షన్ హాలు వద్ద దూదేకులతో ఆత్మీయ సమావేశం.

8.55 – కళ్యాణదుర్గం సర్కిల్ లో ఎస్టీ సామాజికవర్గీయులతో సమావేశం.

9.10 – నారాయణపురం అన్న క్యాంటీన్ వద్ద వడ్డెర సామాజికవర్గీయులతో భేటీ.

9.20 – నారాయణపురం ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ వద్ద బలిజ సామాజికవర్గీయులతో సమావేశం.

10.10- ఎంవైఆర్ కళ్యాణ మండపం వద్ద రాత్రి బస.




  • Loading...

More Telugu News