Vallabhaneni Vamsi: మేమేదో గోడ దూకుతామని కొందరు మెరుపు కలలు కంటున్నారు.. వల్లభనేని వంశీ
- తాను, కొడాలి నాని పార్టీ మారుతున్నామన్న ప్రచారంలో నిజం లేదన్న వల్లభనేని వంశీ
- వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని విమర్శ
- ఐఎస్ బీలో పరీక్షలు రాస్తున్నందువల్లే జగన్ సమీక్షకు ళ్లలేదని వెల్లడి
- లోకేశ్ చేసేది అభద్రతా భావ యాత్ర అని ఎద్దేవా
తాను, కొడాలి నాని పార్టీ మారుతున్నామంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. ‘‘మేమేదో గోడ దూకుతామని కొందరు మెరుపు కలలు కంటున్నారు. అలాంటి వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’’ అని చెప్పారు. విరాళాలు, నిధుల కోసమే ముందస్తు ఎన్నికలంటూ టీడీపీ ప్రచారాలు చేస్తోందని విమర్శించారు.
ఏపీ సీఎం జగన్ నిర్వహించిన రివ్యూ సమావేశానికి హాజరుకాకపోవడంపై వంశీ స్పందించారు. తాను ఐఎస్ బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)లో పరీక్షలు రాస్తున్నానని, అందుకే సమీక్షకు వెళ్లలేదని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని వంశీ ఆరోపించారు. గెలుపు ఓటములను నిర్ణయించేది ప్రజలని, ఎమ్మెల్యేలు కాదని చెప్పారు. నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర దేనికి పనికి రాదంటూ విమర్శించారు.
టీడీపీ ఒక ఎమ్మెల్సీ సీటు గెలవడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని వల్లభనేని వంశీ అన్నారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ సీటు గెలవడం కోసం తన మాజీ బాస్ చంద్రబాబు ‘ఓటుకు నోటు కేసు’లో దొరికిపోయారని ఎద్దేవా చేశారు. ఆ నలుగురిని.. అధికారంలో ఉన్న పార్టీ సంతృప్తి పరచలేకపోతే.. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఏ రకంగా సంతృప్తి పరచి ఉంటారని ప్రశ్నించారు. కామన్సెన్స్ ఉన్న ఎవరికైనా సులభంగానే విషయం అర్ధమైపోతుందన్నారు. గతంలో మాదిరి చంద్రబాబు, ఆయన అనుచరులెవరూ దొరకలేదని, అదే వాళ్ల అదృష్టమన్నారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేసింది.. ఇక ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీలో కూడా వచ్చేస్తామంటారని ఎద్దేవా చేశారు. ‘‘నాయకుడనేవాడు అలా చెప్పుకోకపోతే కేడర్ ఉండదు. గోబెల్స్ కబుర్లు, పోసుకోలు కబుర్లు చెప్పడంలో చంద్రబాబు నెంబర్ 1. 2019 ఎన్నికల కౌంటింగ్ రోజున కూడా ఇలాగే చెప్పారు. గెలిచిన మాకే ఇన్ని హరికథలు చెబితే.. కేడర్‌కు చెప్పరా? వాళ్లు ఎప్పుడూ అమాయకులే. విరాళాల కోసం టీడీపీ ముందస్తు ఎన్నికల పేరుతో హడావుడి చేస్తోంది’’ అని విమర్శించారు.
‘‘చంద్రబాబుకు పడని ఓటు లోకేశ్ కు ఎలా పడుతుంది. లోకేశ్ చేసేది అభద్రతా భావ యాత్ర.. చంద్రబాబు అవసానదశలో ఉన్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబే చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను బ్లాక్ చేయడం కోసమే నారా లోకేశ్ పాదయాత్ర. పాదయాత్ర రికార్డ్ పర్పస్ కోసమే. అంతే తప్ప ఏ ఒక్క ఓటు పెరగదు’’ అని వంశీ విమర్శించారు. లోకేశ్ కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటేనని ఎద్దేవా చేశారు.