spain: స్పెయిన్ లో పేలిన వాషింగ్ మెషిన్.. వీడియో ఇదిగో!
- కొద్ది క్షణాల ముందే బయటకెళ్లడంతో వ్యక్తికి తప్పిన ముప్పు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- బట్టల్లో లైటర్ లేదా ఛార్జర్ ఉండడమే ప్రమాదానికి కారణమని తేల్చిన అధికారులు
సెల్ ఫోన్ పేలి గాయాలపాలయ్యారనో.. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉన్నట్టుండి మంటలు ఎగిసిపడ్డాయనో తరచుగా వింటుంటాం.. స్పెయిన్ లో మాత్రం ఓ వాషింగ్ మెషిన్ పేలిపోవడం సంచలనంగా మారింది. రన్నింగ్ లో ఉన్న మెషిన్ డోర్ అకస్మాత్తుగా తెరుచుకుంది. ఆపై ఒక్కసారిగా మెషిన్ పేలింది. దీంతో ఆ గది మొత్తం ధ్వంసమైంది. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు ఓ వ్యక్తి భుజాన బ్యాగులతో బయటకు వెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. క్షణం లేట్ అయితే ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడేవాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే..
స్పెయిన్ లో ఓ వాషింగ్ మెషిన్ సెంటర్ లోని మెషిన్ ఒకటి ఉన్నట్టుండి పేలిపోయింది. వాషింగ్ జరుగుతుండగానే డోర్ తెరుచుకుంది. లోపలి నుంచి బట్టలు బయటపడుతున్న క్షణంలోనే పేలుడు జరిగింది. దీంతో ఆ సెంటర్ లో విధ్వంసం చోటుచేసుకుంది. ఎంట్రన్స్ లో అమర్చిన అద్దాలు పగిలిపోయాయి. ఆ రూమ్ మొత్తం భయానకంగా మారిపోయింది. ఈ ఘటన జరగడానికి కొద్ది క్షణాల ముందు ఓ వ్యక్తి బయటకు వెళ్లాడు.
చేతిలో బట్టల బ్యాగుతో ఆయన అలా వెళ్లాడో లేదో ఇలా పేలుడు సంభవించింది. బయటకువెళ్లడం కాస్త ఆలస్యమయ్యుంటే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉండేదోనని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, వాషింగ్ మెషిన్ లో వేసిన బట్టల్లో లైటర్, ఛార్జర్ ఉంటే ఇలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని సూచించారు.