Kane Williamson: అయ్యో కేన్... ఊతకర్రలతో నడుస్తూ న్యూజిలాండ్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చిన విలియమ్సన్
- ఐపీఎల్-16 ఆరంభ మ్యాచ్ లో విలియమ్సన్ కు తీవ్రగాయం
- గైక్వాడ్ కొట్టిన షాట్ ఆపే ప్రయత్నంలో నేలను గుద్దుకున్న కుడి మోకాలు
- ఐపీఎల్ తాజా సీజన్ మొత్తానికి దూరమైన కివీస్ లెజెండ్
- స్వదేశానికి చేరుకున్న వైనం
న్యూజిలాండ్ క్రికెట్ లెజెండ్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో విలియమ్సన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.
సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన భారీ షాట్ ను ఆపేందుకు విలియమ్సన్ గాల్లోకి డైవ్ చేశాడు. అయితే ల్యాండ్ అయ్యే క్రమంలో కుడి మోకాలికి తీవ్ర గాయమైంది. దాంతో, ఐపీఎల్ తాజా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
భారత్ నుంచి పయనమైన ఈ స్టార్ క్రికెటర్ న్యూజిలాండ్ చేరుకున్నాడు. అక్కడి ఎయిర్ పోర్టులో, చంకల్లో ఊతకర్రలతో, కాలుకు బ్యాండేజిలతో దర్శనమిచ్చాడు. ఊతకర్రలతో నడుస్తూనే మీడియాతో మాట్లాడుతూ ఎయిర్ పోర్టు వెలుపలికి వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. విలియమ్సన్ పరిస్థితి చూసి అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.