AP Employees: రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న ఏపీ ఉద్యోగ సంఘాలు

AP Employees Associations will announce agitations program

  • డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట
  • రేపు ఉదయం ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ భేటీ
  • ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటామన్న ఉద్యోగ సంఘాలు

గత కొన్నాళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ల సాధన విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం ప్రతినిధులతో పలు సమావేశాలు జరిపినప్పటికీ, ఇప్పటికీ సమస్యలు ఓ కొలిక్కి రాలేదు. 

ఈ నేపథ్యంలో, రేపు ఉదయం 9 గంటలకు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఉద్యోగ సంఘాలు భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నాయి. ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లపై రేపు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. 

కాగా, డిమాండ్ల సాధన కోసం ఏపీజేఏసీ అమరావతి అన్ని ఆఫీసుల్లో ఆందోళన కార్యక్రమాలు తలపెట్టిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు ఈ నెల 9 నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి, వర్క్ టు రూల్ చేపడుతున్నారు. ఉద్యోగులు తమకు 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 11వ పీఆర్సీ ప్రతిపాదించిన పే స్కేల్ విడుదల చేయాలని కోరుతున్నారు.

పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలు, అరియర్స్ వెంటనే చెల్లించాలన్నది ఉద్యోగుల డిమాండ్లలో ఒకటి. పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ కొనసాగించాలని ఏపీజేఏసీ అమరావతి కోరుతోంది. 

ఉద్యోగులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలని, జిల్లా కేంద్రాల్లో ఉండే వారికి 16 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ప్రతిపాదిస్తున్నాయి.

  • Loading...

More Telugu News