Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్ పై లోక్ సభ స్పీకర్ కు సమాచారాన్ని ఇచ్చాం: వరంగల్ సీపీ రంగనాథ్
- హిందీ పరీక్షకు ముందు రోజు సంజయ్, ప్రశాంత్ చాటింగ్ చేశారన్న పోలీస్ కమిషనర్
- వీరి మధ్య జరిగిన సంభాషణే కేసులో కీలకమని వ్యాఖ్య
- ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు పథకం ప్రకారమే అంతా చేశారన్న సీపీ
టెన్త్ పరీక్ష లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ... హిందీ క్వశ్చన్ పేపర్ ను ప్రశాంత్ వైరల్ చేశారని చెప్పారు. బండి సంజయ్ కు ఆ పేపర్ ను 11.24 గంటలకు ప్రశాంత్ పంపారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కూడా ఉదయం 10.41కి పేపర్ పంపించారని తెలిపారు. హిందీ పరీక్షకు ముందు రోజే బండి సంజయ్, ప్రశాంత్ ఫోన్ లో చాటింగ్ చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని అన్నారు.
కమలాపూర్ స్కూల్ నుంచి పేపర్ బయటకు వచ్చిందని చెప్పారు. బీజేపీలో చాలా మందికి పేపర్ ను షేర్ చేశారని తెలిపారు. ఉదయం 9.30 గంటలకే పేపర్ లీక్ అయినట్టు ప్రశాంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ కేసులో ఎవరినీ అనవసరంగా ఇరికించాలనే దురుద్దేశం తమకు లేదని తెలిపారు. బండి సంజయ్ అరెస్ట్ కు సంబంధించిన సమాచారాన్ని లోక్ సభ స్పీకర్ కు ఇచ్చామని వెల్లడించారు. బండి సంజయ్, ప్రశాంత్ మధ్య జరిగిన సంభాషణే ఈ కేసులో కీలకమని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరింత మంది సాక్షులను విచారించాల్సి ఉందని అన్నారు. ప్రశాంత్ పేపర్ లీక్ చేసిన వెంటనే బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టారని... దురుద్దేశంతోనే ఆయన ఈ పని చేసినట్టు నిర్ధారణ అయిందని చెప్పారు.