USA: 138 ఏళ్ల తర్వాత ఆ వంశంలో తొలి ఆడపిల్ల.. ఎగిరి గంతేస్తున్న దంపతులు!
- అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రంలో ఘటన
- 1885 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు క్లార్క్ కుటుంబంలో అమ్మాయి
- ఇప్పటి వరకు ఎప్పుడూ అమ్మాయి పేరు కూడా ఆలోచించలేదన్న క్లార్క్
- చిన్నారికి ఆడ్రీ అని నామకరణం
అబ్బాయా? అమ్మాయా?.. పుట్టేదెవరో తెలియక ఆ దంపతులు 9 నెలలపాటు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇక, డెలివరీ సమయంలో ఒకటే టెన్షన్. పుట్టింది అమ్మాయని తెలియగానే వారందరూ ఆసుపత్రిలో ఎగిరి గంతేశారు. వారి ఆనందానికి ఓ పెద్ద కారణమే ఉంది. 1885 సంవత్సరం తర్వాత అంటే దాదాపు 138 సంవత్సరాల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల పుట్టడమే అందుకు కారణం. అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రంలో జరిగిందీ ఘటన.
కలడోనియా నివాసి ఆండ్రూ క్లార్క్-కరోలిన్ కుటుంబంలో 1885 తర్వాత ఆడపిల్ల పుట్టింది లేదు. అమ్మాయి కోసం ఆ వంశం వారు శతాబ్దంపాటు ఎదురుచూశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరికి 138 సంవత్సరాల తర్వాత ఇన్నాళ్లకు ఆ వంశంలో ఆడపిల్ల జన్మించి సంతోషాలు నింపింది.
తమ కుటుంబంలో అమ్మాయి లేనందుకు చాలా బాధపడేదానినని కరోలిన్ చెప్పుకొచ్చారు. గర్భం దాల్చిన తర్వాత ఎవరు పుడతారన్న విషయాన్ని తాను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు పాప పుట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ అమ్మాయి పేరు గురించి ఆలోచించ లేదని, ఇప్పుడు తొలిసారి పుట్టిన పాపకు పేరు పెట్టడం కష్టంగా అనిపించిందన్న క్లార్క్.. కుమార్తెకు ఆడ్రీ అని పేరు పెట్టినట్టు చెప్పారు. కాగా, ఈ జంటకు ఇప్పటికే నాలుగేళ్ల కామెరాన్ ఉన్నాడు.