Narendra Modi: ప్రధాని పర్యటన నేపథ్యంలో రేపు హైదరాబాద్ లో ఆ రోడ్లు బ్లాక్
- సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్న మోదీ
- అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని
- ఆయా మార్గాల్లో రోడ్లను ముసివేస్తున్నట్టు పోలీసుల ప్రకటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులు తెలిపారు. మోనప్ప జంక్షన్–టివోలి జంక్షన్–సెయింట్ జాన్ రోటరీ–సంగీత్ క్రాస్ రోడ్–చిలకలగూడ జంక్షన్, ఎంజీ రోడ్, ఆర్‌పీరోడ్-ఎస్పీ రోడ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నేరుగా పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఆ మార్గంలో ప్రయాణించొద్దని ప్రయాణికులకు పోలీసులు సూచించారు. టివోలి క్రాస్‌రోడ్ నుంచి ప్లాజా క్రాస్‌రోడ్‌ల మధ్య ఉన్న రోడ్డును మూసివేయనున్నట్లు తెలిపారు. ఎస్‌బీఎస్ క్రాస్‌రోడ్‌ల మధ్య స్వీకర్ ఉప్కార్ జంక్షన్- వైస్ వెర్సా మధ్య రోడ్డును మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో ప్రయాణించే సాధారణ ప్రయాణికులు సకాలంలో రైల్వేస్టేషన్‌కు ముందుగానే చేరుకోవాలని సూచించారు. చిలకలగూడ జంక్షన్ వైపు నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌లోకి ప్రవేశాలను పరిమితం చేసినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమ ప్రయాణానికి సంబంధించి ప్రణాళిక వేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను విజ్ఞప్తి చేశారు.