Delhi: ఢిల్లీ రోడ్లపై ఇక డీజిల్, పెట్రోల్ టాక్సీలను అనుమతించరట.. ఎప్పటి నుంచంటే..!
- ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలంటున్న ప్రభుత్వం
- 2030 ఏప్రిల్ తర్వాత ఒక్క టాక్సీ కూడా తిరగకూడదని టార్గెట్
- ఈ కామర్స్ సంస్థల వాహనాలకూ ఇదే నిబంధన
- కొత్త పాలసీని తీసుకొచ్చే ప్రయత్నంలో కేజ్రీవాల్ సర్కారు
దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్, పెట్రోల్ వాహనాల వాడకాన్ని నియంత్రించేందుకు కేజ్రీవాల్ సర్కారు కొత్త రూల్ తీసుకురానుంది. టాక్సీలు, ఈ కామర్స్ సంస్థలు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలనే సమకూర్చుకోవాలని సూచిస్తోంది. 2030 ఏప్రిల్ నాటికి ఈ మార్పు పూర్తవ్వాలని, ఆ తర్వాత ఢిల్లీ రోడ్లపైకి డీజిల్, పెట్రోల్ టాక్సీలను కానీ ఈ కామర్స్ సంస్థల వాహనాలు (బైక్, వ్యాన్ తదితర) అనుమతించబోమని చెబుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పాలసీ తీసుకొస్తోంది. ప్రస్తుతం దీనికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం లభించిందని, రవాణా శాఖ అనుమతితో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ తెలిపారు.
ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ పాలసీని తీసుకొస్తున్నట్లు మంత్రి కైలాశ్ గెహ్లాట్ చెప్పారు. ఇందులో భాగంగా డీజిల్, పెట్రోల్ వాహనాలను దశలవారీగా తగ్గిస్తూ, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించనున్నట్లు వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఢిల్లీలో చార్జింగ్ పాయింట్ల సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్ సంస్థలు తమ సిబ్బందికి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలనే అందించాలని మంత్రి చెప్పారు. కాగా, ఎలక్ట్రిక్ వాహనాల వాడకంలో దేశంలోనే ఢిల్లీ ముందుందని మంత్రి కైలాశ్ గెహ్లాట్ తెలిపారు.