YSRCP: ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నారు: చినరాజప్ప
- వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తోందన్న చినరాజప్ప
- ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపణ
- జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వ్యాఖ్య
ఏపీని వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసిందని... రాష్ట్రం సర్వనాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తోందని టీడీపీ నేత మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్, ఆర్టీసీ తదితర ఛార్జీలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. అమ్మఒడి ఇచ్చిన జగన్ విద్యార్థులకు స్కాలర్ షిప్ లను రద్దు చేశారని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని... ప్రతిపక్షాలే లేకుండా చేయాలనుకుంటున్నారని విమర్శించారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నారా లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని చినరాజప్ప అన్నారు. జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని... ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమని అన్నారు. సంక్షేమ పథకాలను కొంత మందికి ఇచ్చి, లక్షలాది మందికి ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.